ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. అదే కొంచెం భూమి ఇస్తే జీవితం నిలబడుతుంది. ఆ వ్యక్తి కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. కొన్ని తరాలకు మేలు జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకే దశాబ్దాలుగా పేదలకు భూములపై హక్కులను కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే భూకమతాలపై పరిమితి విధించి- మిగులు భూములను పేదలకు పంచారు. భూదాన్ భూములు, ప్రభుత్వ భూములను పంపిణీ చేశారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పేదలకు పంచిన (అసైన్డ్) భూములను ఎవరూ ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అసైన్డ్ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు బదలాయించకూడదనేది చట్ట నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా- మరోవైపు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. అవసరానికి అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడంవల్ల అవస్థలు పడుతున్నామని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని రకాల అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చని చట్టంలో మార్పులు చేశారు. అసైన్డ్ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పించడమా లేదా చట్టాన్ని మరింత సడలించడమా అనే చర్చ జరుగుతోంది.
అనుభవ హక్కులు మాత్రమే..
స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అందరికీ భూమి హక్కులు ఉండాలనే లక్ష్యంగా భూసంస్కరణలు ప్రారంభమైనాయి. కౌలుదారులకు రక్షణలు, ఇనాం, జాగీర్లు, సంస్థానాలులాంటి వ్యవస్థలను రద్దుచేసి- దున్నేవారికే భూమిపై హక్కులు కల్పించడం మొదటి తరం భూసంస్కరణలు. రెండోదశలో ప్రభుత్వ, భూదాన భూముల పంపిణీ చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు అరకోటి ఎకరాల ప్రభుత్వ భూమి, లక్ష ఎకరాల పైచిలుకు భూదాన భూమిని పేదలకు పంచారు. ప్రభుత్వ భూములపై పేదలకు ఇచ్చిన పట్టాలనే అసైన్డ్, డిఫార్మ్, లావోని, డికెటీ పట్టాలని అంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూములను పంచారు. పేదలకు పంచిన భూములను వారసత్వంగా అనుభవించాలే కానీ అమ్ముకోవడం, దానం చేయడం, కౌలుకు ఇవ్వడం కుదరదని; వీలునామా, తనఖా లేదా మరేవిధంగానైనా బదలాయించడానికి వీలులేదనేది ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో ఒక ముఖ్యమైన షరతు. కానీ, పేదలకు ఇచ్చిన భూములు వారి స్వాధీనంలో ఎక్కువకాలం ఉండటంలేదు. అందుకే, పేదలకు ఇచ్చిన భూముల రక్షణ కోసం 70వ దశకంలో కేంద్రం ఒక ముసాయిదా చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది. దాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం 1977లో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పీఓటీ లేదా 9/77 చట్టం అని అంటారు. ఈ చట్టం మేరకు అసైన్డ్ భూముల బదలాయింపు చెల్లదు. పేదలకిచ్చిన భూదాన్ భూములను అమ్మకూడదని భూదాన, గ్రామదాన చట్టం-1965లో సీలింగ్ పట్టాలిచ్చిన వాటిని అమ్మకూడదని వ్యవసాయ భూపరిమితి చట్టం-1961లో నిబంధనలు ఉన్నాయి. చట్టం చేసినప్పుడే ఈ నిబంధనలకు కొన్ని మినహాయింపులూ ఇచ్చారు. మరికొన్నింటిని ఆ తరవాత చట్టంలో చేర్చారు. 1958 కంటే ముందు తెలంగాణలో, 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అసైన్ చేసిన, 1977కి ముందు భూమిలేని పేదలు కొనుగోలు చేసిన, వేలంలో కొన్న, రాజకీయ బాధితులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాలను 20 సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చు.
అసైన్డ్ భూముల అమ్మకాలపై నిషేధం లేకపోతే పేదల చేతుల్లో సెంటుభూమి సైతం మిగలదనే వాదనా అంతే బలంగా ఉంది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని తిరిగి మొదటి అసైనీకి అప్పగించడమో లేదా మరో పేద కుటుంబానికి ఇవ్వడమో చెయ్యాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు భూకమిటీ సూచించింది. అసైన్డ్ భూములను బ్యాంకులు వేలం వేస్తే అవి ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూసంస్కరణల కమిటీ' కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది.
ప్రభుత్వమే కొనుగోలు..