ధర్మదామ్... కేరళ కన్నూర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం. అధికార వామపక్ష పార్టీకి కంచుకోట. ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరుసగా రెండోసారి పోటీ చేస్తోంది ఈ స్థానం నుంచే. ప్రస్తుతం ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకిలా? విజయన్‌కు ప్రత్యర్థులు ఎవరు? ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఓసారి పరిశీలిద్దాం.
ధర్మదామ్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. తొలిసారి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి లెఫ్ట్ పార్టీకి కంచుకోటగా మారింది. తొలి ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి కేకే నారయణన్ విజయం సాధించారు. 2016లో విజయన్ 36 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో యూడీఎఫ్ అభ్యర్థిపై గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
ఈ నియోజకవర్గంలోని 8 పంచాయతీల్లో ఏడు లెఫ్ట్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. గత చరిత్ర కూడా ఎల్డీఎఫ్కే అనుకూలంగా ఉంది. అందుకే మరోసారి ఈ నియోజకవర్గం నుంచే బరిలో దిగుతున్నారు విజయన్.
యూడీఎఫ్‌కు ఈసారైనా విజయం దక్కేనా?
ధర్మదామ్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించలేకపోయింది. అందుకే ఈసారి సరైన అభ్యర్థి ఎంపిక కోసం విస్తృత కసరత్తు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, గత చరిత్రను చూసుకుంటే యూడీఎఫ్‌కు ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే.. శబరిమల, ఇతర కీలక అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతపైనే యూడీఎఫ్ నమ్మకం పెట్టుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికలు, కదంబుర్ పంచాయతీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరచటం కాస్త సానుకూల అంశం.
బరిలో రఘునాథ్
ముఖ్యమంత్రి విజయన్ను ఎదుర్కొనేందుకు తగిన అభ్యర్థిని ఎంపిక చేయటంలో తలమునకలైన యూడీఎఫ్.. నామినేషన్ దాఖలు గడువు ముగింపునకు ఒకరోజు ముందు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సి.రఘునాథ్ నామినేషన్ దాఖలు చేశారు.
తెరపైకి పలువురి పేర్లు..
నిజానికి ధర్మదామ్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ముందుగా జాతీయ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే.. పోటీకి ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో వలయార్ బాలికల తల్లి కాంగ్రెస్ తరఫున విజయన్ను ఎదుర్కొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ స్థానిక నేతలు అందుకు అంగీకరించకపోగా.. ఆ ప్రతిపాదనను విరమించుకుంది నాయకత్వం. ఆ తర్వాత కె.సుధాకరన్ పేరును ప్రతిపాదించగా.. ఆయనా తిరస్కరించారు. రఘునాథ్ పేరును సూచించారు.
ఎన్డీఏ పుంజుకునేనా?