గోపాల గోపాల సినిమాలో దేవుడికి నోటీసులు పంపినట్లు.. హనుమాన్ మందిరానికి రైల్వే శాఖ నోటీసులు పంపింది. ఈ చర్యతో చుట్టు పక్కల ప్రజల నుంచి రైల్వేపై వ్యతిరేకత ఎదురవుతుంది. ఝార్ఖండ్‌లో ధన్‌బాద్ జిల్లాలో భారతీయ తూర్పు మధ్య రైల్వేలో ఈ వింత అనుభవం ఎదురైంది.
హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు.. స్థలం ఖాళీ చేయాలని ఆదేశం.. అసలేమైంది? - హనుమాన్ మందిర నోటీసు
రైల్వే భూమిని ఆక్రమించి హనుమాన్ మందిరం నిర్మించారని.. ఆ ఆలయానికి రైల్వేశాఖ నోటీసు పంపింది. రైల్వేశాఖ పంపిన ఈ నోటీసుపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అసలు ఆ నోటీసులో ఏం ఉందంటే..
ధన్‌బాద్ జిల్లా బేకర్‌బంద్ కాలనీలోని రైల్వే భూమి అనధికారికంగా ఆక్రమణకు గురైందని.. తూర్పు మధ్య రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ పేరుతో ఆలయంలో నోటీసు అంటించారు. రైల్వే భూమిలో ఆలయాన్ని అక్రమంగా నిర్మించడం చట్టరీత్యా నేరమని.. నోటీసు అందిన పది రోజుల్లోగా ఈ భూమిని ఖాళీ చేయాలని అందులో రాసి ఉంది. భూమిని ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌కు అప్పగించాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఈ నోటీసు అందిన తరవాత.. సమీపంలో నివసిస్తున్న ప్రజల్లో రైల్వే శాఖ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజలు నిరసనకు దిగారు. తాము తరతరాలుగా ఈ హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. 1931 నుంచే ఇక్కడ చాలా మంది నివాసం ఉంటున్నారని.. ఇప్పుడు ఆలయాన్ని తొలగించాలని రైల్వే శాఖ ఒత్తిడి తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.