Devraha Baba Ayodhya Ram Mandir Prediction : అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని 33 ఏళ్ల క్రితమే చెప్పారు దేవహ్రా బాబా అనే సాధువు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని, అన్ని మతాలు కలిసికట్టుగా ఆలయ నిర్మాణంలో భాగమవుతాయని దేవ్రహా బాబా అంచనా వేశారు. అన్ని వర్గాల అంగీకారంతో రామాలయాన్ని కడతామని ఆయన మీడియాతో అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
కాగా, డియోరియా జిల్లాలోని దేవ్రహా బాబా ఆశ్రమానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందింది. ఇది శుభపరిణామమని, తప్పకుండా అయోధ్యకు వెళ్తామని దేవ్రహా బాబా ఆశ్రమానికి చెందిన మహంత్ శ్యామ్ సుందర్ దాస్ చెప్పారు. 33 ఏళ్ల క్రితమే అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుందని దేవ్రహా బాబా చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేతలకు దేవ్రహా బాబా చెప్పారని మహంత్ శ్యామ్ సుందర్ దాస్ అన్నారు.
అసలేవరు ఈ దేవ్రహా బాబా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దేవ్రహా బాబా జన్మించారు. ఆయన 1990లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. దేవ్రహా బాబాకు శక్తులు ఉన్నాయని, ఆయన భవిష్యత్తును ముందే ఊహించగలరని ఆయన భక్తులు నమ్ముతారు. ఆయన వయసుపై కూడా పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బాబా 250 ఏళ్లు జీవించారని కొందరు, 500 ఏళ్లని మరికొందరు అంటున్నారు. దివంగత మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవీయ వంటి ప్రముఖులు కూడా దేవ్రహా బాబా భక్తులని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
'పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్'
అయోధ్య విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం' గా పేరుపెట్టడానికి కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను ఇచ్చింది.