తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భక్తులకు చుక్కలు

Simhadri Appanna: ఏడాదికోసారి వైభవంగా జరిగే చందనోత్సవాన్ని చూసి.. అప్పన్న నిజరూప దర్శనం కనులారా చూద్దామని వచ్చిన భక్తులకు అధికారులు చుక్కలు చూపించారు. అస్తవ్యస్త ఏర్పాట్లు, ప్రణాళిక లోపం భక్తులను తీవ్ర ఇక్కట్లకు గురి చేశాయి. స్వామివారి నామస్మరణతో మార్మోగాల్సిన సింహగిరులు... లోపభూయిష్ట ఏర్పాట్ల కారణంగా... ప్రభుత్వం, మంత్రులు, ఆలయ అధికారులు, పోలీసుల పట్ల అసహన వ్యాఖ్యలతో నిండిపోయింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 23, 2023, 10:30 PM IST

సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

Simhadri Appanna Darshan: సింహాచలంలో వెలసిన శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూపదర్శనం ఏటా వైశాఖ శుద్ధ తృతీయ నాడు లభిస్తుంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామి పూర్తిగా చందనం పూత లేకుండా నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు కళ్లు కాయలు కాచేలా ఏడాదంతా ఎదురుచూస్తారు. ముందు నుంచే టికెట్లు కొనుక్కొని స్వామివారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతారు. చిన్నాచితకా ఇబ్బందులు తప్పవని భావించి.. వాటికి సిద్ధమయ్యే దర్శనానికి వెళ్తారు. ఈ ఏడాది మాత్రం భక్తులను జీవితాంతం గుర్తుండిపోయేలా ఆలయ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు..

ఆనవాయితీ ప్రకారం... ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించే విజయనగరం రాజకుటుంబీకులు పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబం.. ఈ తెల్లవారుజామున... తొట్టతొలిగా.. స్వామి నిజరూపదర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రులు, వారి కుటుంబాలకు దర్శనాలు లభించాయి. తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు కల్పించారు. ఇక్కడే తోపులాటలు, వేచి చూడాల్సిన సమయం పెరగడంతో భక్తుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. అనకాపల్లి ఎంపీ సత్యవతి, విశాఖ మేయర్‌ హరివెంకటకుమారితోపాటు ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే న్యాయవిభాగం అధికారుుల.. గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రోటోకాల్ సిఫార్సులతో జారీ చేసిన 15 వందల రూపాయల క్యూలైన్ల వద్ద పలుమార్లు తోపులాట చోటు చేసుకుంది. పిల్లలు, వృద్ధులతో భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. క్యూలైన్లు కదలకపోవడంతో.., మంచినీరు లేక మరుగుదొడ్లకు వెళ్లలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..

15 వందల రూపాయల టికెట్లు కొన్న తమను క్యూలైన్లతో నిల్చోబెట్టి... ప్రజాప్రతినిధులను వరుసగా దర్శనాలకు పంపడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు తమ వెంట పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులను తీసుకెళ్లారని ఆరోపించారు. పోలీసులు, ఆలయ అధికారులే దగ్గరుండి వారిని దర్శనాలకు తీసుకెళ్లారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను మాత్రం గంటల తరబడి క్యూలైన్లలోనే నిల్చోబెట్టారని వాపోయారు. గంటల తరబడి క్యూలైన్లు కదలకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ దర్శనానికి రాగా... ఆయన్ని భక్తులు అడ్డుకున్నారు. ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. మంత్రి బొత్సకు, భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాగా... ఆయనపైనా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింహాచలం గోపురం వద్ద ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చినవారి మధ్య అనేక సార్లు తోపులాటలు చోటు చేసుకున్నాయి. క్యూలైన్లలోను తోపులాటలు జరిగాయి. పోలీసులు భక్తులపై లాఠీలు ఝుళిపించారు. వెయ్యి, 300 రూపాయల దర్శనం క్యూలు, సర్వదర్శనం క్యూలైన్లు చాలా మందకొడిగా సాగాయి. మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వస్తుందని భక్తులు భావించినా... ఆ తర్వాత కూడా కష్టాలు కొనసాగాయి. దర్శన ఏర్పాట్లలో అడుగడుగునా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇంత దారుణమైన ఏర్పాట్లను ఎప్పుడూ చూడలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

కొండపై పరిస్థితి ఇలాఉంటే... ఘాట్‌ రోడ్డులోనూ ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలే కాకుండా దేవస్థానం బస్సులు కూడా కదల్లేకపోయాయి. భక్తులు కింది నుంచి ఘాట్‌ రోడ్డు ద్వారా నడుచుకుంటూనే కొండపైకి వెళ్లారు. ఇంత కష్టపడి ఆలయానికి చేరుకున్నా... స్వామివారి దర్శనం కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చింది. బీర్​టీఎస్ రోడ్డులోనూ ఎటు వాహనాలు అటే నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details