నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేంద్రం ఇప్పుడైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించనున్నట్లు మమత తెలిపారు. శ్యాంబజార్ నుంచి నేతాజీ విగ్రహం వరకు పోలీస్ బ్యాండ్‌తో ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు విదేశాల్లోని భారతీయులు సహా దేశంలోని ప్రతి ఒక్కరు శంఖం ఊది నేతాజీకి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.
నేతాజీ జయంతి రోజైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్లు మమత తెలిపారు. ఆ రోజు బంగాల్లో 'దేశ్ నాయక్ దివస్' నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నేతాజీ కోసం మనం ఏం చేయలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను కేంద్రం ఇప్పుడైనా బహిర్గతం చేయాలని కోరారు.