ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్‌దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి బ్యాంకుల్లోని డిపాజిట్‌దారులు 90 రోజుల్లో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు తమ సొమ్ము వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించే డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గత ఏడాది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేషన్ బ్యాంకుపై మారటోరియం విధించిన క్రమంలో డిపాజిటర్లకు మద్దతుగా నిలిచేందుకు.. డిపాజిట్లపై బీమా మొత్తాన్ని ఐదింతలకు పెంచి, రూ. 5లక్షలు చేసింది కేంద్రం. పీఎంసీ బ్యాంకు, ఎస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకులు దివాలా తీయటం వల్ల ఈ మార్పులు చేసింది.
డీసీజీఐసీ చట్టం 1961కు సవరణల గురించి బడ్జెట్ ప్రసంగంలోనే తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే.. వేలాది మంది డిపాజిటర్లకు లబ్ధి చేకూరనుంది.
"బ్యాంకులపై ఆర్బీఐ మారటోరియం విధించిన క్రమంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కు సవరణలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా 90 రోజుల్లో ఖాతాదారులు తమ డబ్బును రూ. 5 లక్షల వరకు పొందే వీలు కలుగనుంది. ఈ పథకం ద్వారా 98.3 శాతం డిపాజిటర్లు లబ్ధి పొందుతారు. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్‌ను సవరించేందుకు కేబినెట్ ఆమోదించింది."
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి.
అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాలు, బహుపాక్షిక ఏజెన్సీలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ కమిషన్స్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్వైజర్స్తో బహుపాక్షిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరిందన్నారు కేంద్ర మంత్రి. చట్టాలకు అనుగుణంగా నడుచుకునే ఎల్ఎల్పీ సంస్థల్లోని వారికి సులభతర వాణిజ్య ప్రయోజనాలను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిబంధనల ఉల్లంఘనలను బట్టే జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఏ వస్తువుకు ఎంత ధర? కంపెనీల ఇష్టమేనా?