Denying sex mental cruelty : భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి నిరాకరించడం వల్ల తన వివాహం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ ఓ మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తన భర్త, అత్తామామలపై మహిళ పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.
కేసు వివరాలు ఇలా..
Denying sex to spouse high court : న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన మహిళకు 2019 డిసెంబర్ 18న వివాహం జరిగింది. ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవాడు. ఈ నేపథ్యంలో మహిళతో శారీరక బంధాన్ని ఏర్పరచుకునేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉండి.. పుట్టింటికి వచ్చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద.. తన భర్త, అత్తామామలపై 2020 ఫిబ్రవరిలో కేసు పెట్టింది. దీంతో పాటు తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ హిందూ వివాహ చట్టం ప్రకారం కేసు పెట్టింది. తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
మహిళ పిటిషన్‌పై విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబర్‌లో వీరి పెళ్లిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. భర్త, అత్తామామలపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో మహిళ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్‌షీట్‌ను ఆయన సవాల్ చేశాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శారీరక బంధాన్ని కాదనడం హిందూ వివాహ చట్టం ప్రకారమే క్రూరత్వం కిందకు వస్తుందని, ఐపీసీ ప్రకారం కాదని తీర్పు చెప్పింది.