రద్దైన పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతూ విడివిడిగా దాఖలయ్యే పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషనర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. వారి అభ్యర్థనలపై కేంద్రం 12 వారాల్లోగా సమాధానమివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం చెప్పే సమాధానంతో పిటిషనర్లు సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సూచించింది.
కేంద్రం నిర్ణయం సరైనదే..
అంతకుముందు పెద్ద నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను ఈ ఏడాది జనవరి 2న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని తేల్చిచెప్పింది. ఆర్బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్యనిర్వాహక విధానాన్ని తాము తప్పుబట్టలేమని తెలిపింది. నోట్ల రద్దును 4-1తో రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్ల ధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణితోపాటు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.చిదంబరం, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. చివరకు పెద్ద నోట్ల రద్దు సరైందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
యాచకుడి వద్ద రూ.65 వేల పాత నోట్లు..
తన దగ్గర రద్దైన రూ.65 వేల విలువైన పాత నోట్లు ఉన్నాయని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు వాపోయాడు. ఈ ఘటన 2021 అక్టోబరులో వెలుగుచూసింది.
ప్రభుత్వం డీమానిటైజేషన్ చేసిన విషయం తెలియక తన పాత నోట్లను మార్చి ఇవ్వాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు ఓ వృద్ధుడు. గత కొన్నేళ్ల నుంచి యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంపాదించిన డబ్బును దాచుకున్నాడు. నోట్ల రద్దుకు ముందు మొత్తం రూ.65 వేలను భద్రపరుచుకున్నాడు. ఇవన్నీ 500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నాయి. ఆ నోట్లను తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు ఇచ్చాడు. ఆ నోట్లు చెల్లవు అని చెప్పేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.