బిహార్ అసెంబ్లీలో ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్-2021ను ప్రవేశపెట్టిన సమయంలో మంగళవారం జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమకు అనుకూలమైన చట్టాలను అమల్లోకి తెచ్చుకునేందుకు అధికార భాజపా-జేడీయూ ప్రభుత్వం.. దౌర్జన్యానికి పాల్పడుతోందని విమర్శించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. భాజపా-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిహార్ అసెంబ్లీ ఘటనపై ట్విట్టర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు "బిహార్ అసెంబ్లీలో జరిగిన ఘటనల ద్వారా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భాజపా, ఆర్ఎస్ఎస్ విధానాలను అనుసరిస్తున్నారని స్పష్టమైంది. ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించే వారికి ప్రభుత్వం అని చెప్పుకొనే అర్హత లేదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఎప్పుడూ తమ వాణిని వినిపిస్తూనే ఉంటాయి. మేము ఎవరికీ భయపడం"
-రాహుల్ గాంధీ.
'73 ఏళ్లలో ఏనాడు జరగలేదు'
బిహార్ అసెంబ్లీలో భాజపా, జేడీయూ చేసినట్లుగా గత 73 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ వీడియో ప్రకటనలో వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా "బిహార్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. ఇప్పుడు ప్రజలు మేల్కొనకపోతే.. దేశంలో ప్రజాస్వామ్యం ఇక మన చేతుల్లో ఉండదు. భాజపా, జేడీయూ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే వారి స్వభావంగా మారిపోయింది."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
మంగళవారం ఏం జరిగింది?
బిహార్ ప్రత్యేక సాయుధ పోలీస్ బిల్-2021కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తకరంగా మారింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదాపడింది. సభ్యులను స్పీకర్ ఎంత శాంతింపజేసినా నిరసనలు ఆగలేదు. దీంతో సభను వాయిదా వేశారు. అయితే.. సభ్యులను అదుపుచేసే క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది తమపై దాడి చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
అసెంబ్లీ బయట ఇంకో అసెంబ్లీ..
మంగళవారం నాటి ఘటనకు నిరసనగా.. బిహార్ అసెంబ్లీ పరిసరాల్లో ప్రతిపక్షాలు బుధవారం మరో అసెంబ్లీని నిర్వహించాయి. సభ నుంచి మంగళవారం బహిష్కరణకు గురైనవారు ఇందులో పాల్గొన్నారు. ఈ సభకు స్పీకర్‌గా ఆర్జేడీ నేత భూదేవ్ చౌదరీ వ్యవహరించారు.
'ఏం జరిగిందో అందరికీ తెలుసు'
అయితే.. ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. స్పీకర్ ఛాంబర్‌ను ప్రతిపక్షాలు ఎలా ముట్టడించాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పరిస్థితులను అదుపులో పెట్టేందుకు పోలీసుల సాయాన్ని తీసుకునే అధికారం ఆయనకు ఉందని అన్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా మహేశ్వర్ హజారి
ప్రతిపక్షాలు సభను బహిష్కరించినప్పటికీ.. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా జేడీయూ నేత మహేశ్వర్ హజారి.. బుధవారం ఎంపికయ్యారు. మూజువాణి ఓటు ద్వారా డిప్యూటీ స్పీకర్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.
ఇదీ చూడండి:చిదంబరం, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు