కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలనూ ప్రభావితం చేస్తుండటం, పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మేలో ఇప్పటిదాకా 1.85 కోట్ల పల్లెజనం ఈ పనులను ఉపయోగించుకున్నారు. 2019లో ఇదే సమయంలో 1.22 కోట్ల కూలీలు మాత్రమే ఈ పనులకు వచ్చారు. ఆ లెక్కన ఈ ఏడాది 52 శాతం ఆదరణ పెరిగింది. ఉపాధి సిబ్బందిపై వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో పనులు జరగటం అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది.
కొవిడ్-19పై ప్రజలను చైతన్యవంతం చేసేలా ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రామస్థాయిలో పలువురికి శిక్షణ ఇచ్చారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- గ్రామీణ ఉపాధి హామీ పథకం(డీఏవై- ఎన్ఆర్ఎల్ఎం) కింద ఈ కార్యక్రమం జరిగింది.