కర్ణాటక బెంగళూరులో భారీ ఆన్లైన్ చోరీ జరిగింది. ఇద్దరు డెలివరీ బాయ్స్ కస్టమర్ ఆర్డర్ చేసిన విలువైన వస్తువులను వారికి ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు. 5 ఐఫోన్లు, ఒక యాపిల్ వాచ్‌ను కస్టమర్లకు డెలివరీ చేయకుండా దొంగిలించి పారిపోయారు డెలివరీ బాయ్స్. వీరిపై సెంట్రల్ డివిజన్‌లోని సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీఈఎన్)లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అరుణ్ పాటిల్, నయన్ జే గా గుర్తించారు.
తస్లీమ్ ఆరీఫ్ అనే వ్యక్తి మార్చి 5న ఒక ఆన్లైన్ కంపెనీలో ఐఫోన్లు, యాపిల్ వాచ్‌ను ఆర్డర్ చేశాడు. విజయనగరలోని తన ఇంటికి డెలివరీ అడ్రస్ ఇచ్చాడు. డెలివరీ అవ్వాల్సిన వస్తువులు తేదీ దాటినా ఇంకా అందకపోవడం వల్ల ఆరీఫ్ డెలివరీ బాయ్స్‌కు ఫోన్ చేశాడు. డెలివరీ బాయ్స్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. కొద్ది సేపటి తర్వాత నయన్ అనే మరో నిందితుడు ఫోన్ చేసి అరుణ్ పాటిల్ అనే డెలివరీ బాయ్ షాపు నుంచి అందజేయాల్సిన వస్తువులను తీసుకున్నాడని.. మరికొద్ది సేపట్లో ఆర్డర్ అందుతుందని తెలిపాడు. అయినా డెలివరీ కాకపోవడం వల్ల ఆరీఫ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈయన ఫిర్యాదుతో జరిగిన విషయం బయటకు వచ్చింది.
"ఇద్దరు డెలివరీ బాయ్‌లు నా పార్శిల్‌ను డెలివరీ చేయలేదు. నేను వారికి కాల్ చేసినప్పుడు, ఇద్దరూ తమ మొబైల్‌లను స్విచ్ఛాఫ్ చేశారు"అని ఆరీఫ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తస్లీమ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ డివిజన్‌లోని సీఈఎన్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. షాపు యజమానిని, డెలివరీ కంపెనీ అధికారులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారీ ఆన్లైన్ మోసం.. ఐఫోన్, యాపిల్ వాచ్‌ను ఎత్తుకెళ్లిన డెలివరీ బాయ్స్ ల్యాప్‌టాప్ బుక్ చేస్తే రాయి వచ్చింది..
అంతకుముందు కర్ణాటకలోనే.. దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది. మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. తీరా పార్సిల్ వచ్చాక ఆత్రుతగా తెరచి చూస్తే.. అందులో రాయి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉన్నాయి. వెంటనే కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి సమస్యను చెప్పినా మొదట ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి: