Delivery Boy Tried To Rape Girl :నిత్యావసరాలు ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గ్రేటర్ నొయిడాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే లొంగిపోయినట్లుగా నటించిన నిందితుడు.. వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడిపై ఎదురుకాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ జరిగింది
గ్రేటర్ నొయిడాలోని ఓ అపార్ట్మెంట్లోని బాధితురాలి కుటుంబం.. ఇంటికి అవసరమైన సరకులను ఆర్డర్ చేసింది. వాటిని తీసుకొని 23 ఏళ్ల సుమిత్ సింగ్ అనే డెలివరీ బాయ్ బాధితురాలి ఇంటికి వెళ్లాడు. సరకులు డెలివరీ చేసిన నిందితుడు.. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని గమనించాడు. ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.