కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో అవాస్కులర్ నెక్రోసిస్(ఏవీఎన్) అనే ఎముక సంబంధిత వ్యాధిని గుర్తించారు. దిల్లీలోని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ముగ్గురు రోగులకు ఈ ఏవీఎన్ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు బాధితుల్లో ఇద్దరు చికిత్స పొందుతుండగా.. మరొకరికి సర్జరీ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
రక్త ప్రసరణ సరిగా లేక ఎముక కణజాలం పూర్తిగా నాశనమయ్యే వ్యాధినే ఏవీఎన్గా వ్యవహరిస్తారు. దీని వల్ల ఎముకల్లో పగుళ్లు ఏర్పడతాయి. క్రమంగా ఎముకలు నాశనమవుతాయి. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్లే ఏవీఎన్ సమస్య తలెత్తుతోందని ఈ రోగులను పరిశీలిస్తున్న వైద్యులు పేర్కొన్నారు.
"కొవిడ్ అనంతర ప్రభావాల్లో ఏవీఎన్ ఒకటి. ఎముకలు, కీళ్లలో ఇది తలెత్తుతుంది. కరోనా చికిత్సలో భాగంగా అధిక స్టెరాయిడ్లు ఉపయోగించడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. స్టెరాయిడ్స్ వల్ల ఎముకలు గట్టిదనాన్ని కోల్పోతాయి. మృదులాస్థి పాడైపోతుంది. రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ వ్యాధి వెంటనే ప్రభావం చూపదు. లక్షణాలు బయటపడేందుకు మూడు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది."