Delhi University Centenary Celebrations : విద్యారంగంలో గత కొన్నేళ్లలో తీసుకున్న నిర్ణయాలతోనే.. భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధించాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా QS గ్లోబల్ ర్యాకింగ్స్లో భారత యూనివర్సిటీలు సత్తా చాటాయని కొనియాడారు. ఈ జాబితాలో 2014లో 12 భారతీయ విద్యాసంస్థలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, ఎయిమ్స్ కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న మోదీ.. ఇవి నవభారతాన్ని నిర్మిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక సమయంలో దిల్లీ యూనివర్సిటీ పరిధిలో కేవలం మూడు కళాశాలలు మాత్రమే ఉండేవని.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 90కు చేరుకుందన్నారు. ఒకప్పుడు మన దేశం బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని.. ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 5లో ఉందని గుర్తు చేశారు. అంతకుముందు విశ్వవిద్యాలయ ఆవరణలో మూడు కొత్త భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పాల్గొన్నారు.
"ఇటీవల నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు చూస్తే.. మన దేశ ప్రతిష్ఠ అమాంతం పెరిగింది. దానికి కారణం మన దేశంలో సత్తా ఉన్న యువతపై వారికున్న నమ్మకమే. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య సెమీకండక్టర్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లాంటి రంగాల్లో కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. ఇవి మన యువతకు ఎంతో మేలు చేస్తాయి. గూగుల్, మైక్రాన్ లాంటి పెద్ద సంస్థలు భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి