స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా.. - స్పైస్‌జెట్ విమానం పొగలు
09:29 July 02
స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..
SpiceJet aircraft smoke: దిల్లీ నుంచి జబల్పుర్ మధ్య ప్రయాణించే స్పైస్‌జెట్ విమానంలో పొగ వ్యాపించింది. విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా.. క్యాబిన్ నుంచి పొగ వస్తున్నట్లు సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు.
వివరాల్లోకి వెళితే...
స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానం దిల్లీ-జబల్పుర్ మధ్య నడుస్తోంది. శనివారం ఉదయం ఇది దిల్లీ నుంచి బయల్దేరింది. అయితే, 5వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానం క్యాబిన్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. దీంతో పైలట్లు విమానాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారని చెప్పారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని.. ప్రయాణికులందరినీ క్షేమంగా కిందకు దించామని స్పష్టం చేశారు.
రెండువారాల వ్యవధిలో ఇలా విమానంలో అనుకోని ఘటనలు తలెత్తడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. జూన్ 19న స్పైస్‌జెట్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. 185 మంది ప్యాసింజర్లు ఉండగా ఈ ఘటన జరిగింది. టేకాఫ్ కాగానే మంటలు వచ్చిన నేపథ్యంలో నిమిషాల్లోనే విమానాన్ని కిందకు దించేశారు. ఓ పక్షిని ఢీకొట్టడం వల్లే ఇంజిన్ దెబ్బతిందని అధికారులు గుర్తించారు. అదేరోజు మరో స్పైస్‌జెట్ విమానం.. టేకాఫ్ అయి గమ్యస్థానానికి చేరకుండానే వెనుదిరిగింది. దిల్లీ నుంచి జబల్పుర్ బయల్దేరిన ఆ విమానం... క్యాబిన్లో ఒత్తిడి తలెత్తిన కారణంగా వెనక్కి మళ్లింది. మరోవైపు, జూన్ 24, 25 తేదీలలో రెండు వేర్వేరు విమానాలు.. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విమానం తలుపులకు ఉన్న హెచ్చరిక వ్యవస్థ.. ఒక్కసారిగా మోగడం వల్ల ముందుజాగ్రత్తగా విమానాలను ల్యాండ్ చేశారు.
ఇదీ చదవండి: