తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్తను, అత్తను హత్య చేసిన భార్య.. ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిడ్జ్​లో.. తర్వాత మూటగట్టి..

భర్తను, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్​లో పెట్టిందో మహిళ. అనంతరం మృతదేహాలను మూటగట్టి ఓ లోయలో పడేసింది. ఈ అమానుష ఘటన అసోంలోని గువహటి సమీపంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Delhi Shraddha murder incident repeat in Assam
భర్తను, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికిన భార్య

By

Published : Feb 20, 2023, 10:38 AM IST

దిల్లీలో శ్రద్ధావాకర్​ను తన ప్రియుడు అఫ్తాబ్​ ముక్కలుగా నరికిన తరహా ఘటన మరొకటి అసోంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఓ భార్య తన భర్త, అత్తను ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్​లో పెట్టింది. అనంతరం మృతదేహాలను మూటగట్టి మేఘాలయ రాష్ట్రంలోని కొండప్రాంతంలో 50-60 అడుగుల లోయలో పడేసింది. హత్యలు జరిగిన ఏడు నెలల తర్వాత ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
గువహటిలోని నరేంగి నివాసి అమరజ్యోతి డే అనే వ్యక్తి.. వందన కలిత అనే మహిళను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల వరకు ఇద్దరూ ఎంతో ఆనందంగానే ఉన్నారు. అయితే వందన.. ధంజిత్ డేకా అనే యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయమై భర్త అమరజ్యోతికి, వందనకు తరచుగా గొడవలు జరిగేవి. నగరంలోని చంద్​మారీ ప్రాంతంలో అమరజ్యోతి తల్లి శంకరీ డేకు ఐదు భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో శంకరీ డే ఒంటరిగా నివసించేది. మిగిలిన నాలుగు భవనాల అద్దెను అమరజ్యోతి మేనమాన వసూలు చేసేవాడు. ఈ విషయం వందనకు నచ్చేది కాదు. ఇలాంటి చాలా కారణాల వల్ల అమరజ్యోతికి, వందనకు మధ్య గొడవలు జరగటం వల్ల విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా ఏడు నెలల క్రితం తన భర్త అమరజ్యోతి, అత్త శంకరీ డే కనిపించకుండా పోయారని వందన.. నూన్మతి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతుండగా.. తన భర్త అమరజ్యోతి డే మేనమామ ఆమె అత్తింటికి చెందిన ఐదు అకౌంట్ల నుంచి డబ్బును స్వాహా చేశాడంటూ వందన రెండో కేసు పెట్టింది. ఈ విషయం పై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. డబ్బు పోయిన ఐదు అకౌంట్లలో ఒకదాని నుంచి ఏటీఎం ద్వారా వందన రూ.5 లక్షలు డ్రా చేసినట్లు తేలింది. ఈ ఘటనతో పోలీసులకు వందనపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. తన భర్త అమరజ్యోతి డే, అత్త శంకరీ డేను చంపినట్లు వందన నేరాన్ని అంగీకరించింది.

అరూప్​ దాస్ అనే యువకుడి సహాయంతో తన అత్త శంకరీ డేను హత్య చేసి, ముక్కలుగా నరికి మూడురోజులు రిఫ్రిజిరేటర్​లో ఉంచినట్లు వందన తెలిపింది. మూడు రోజుల తర్వాత తన ప్రియుడు ధంజిత్ డేకా సహాయంతో నారేంగిలోని తన నివాసంలో భర్త అమరజ్యోతి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. భర్తను కూడా ముక్కలుగా నరికి పాలిథీన్​ కవర్​లో ప్యాక్​ చేసినట్లు తెలిపింది. ముగ్గురు నిందితులు.. మృతదేహాలను మూటగట్టి ధంజిత్ డేకా కారులో తీసుకుని వెళ్లి మోఘాలయలోని దౌకి వద్ద లోయలో పడేసినట్లు వందన నేరాన్ని అంగీకరించింది.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నూన్మతి స్టేషను​కు తీసుకుని వచ్చారు. ఆదివారం తెల్లవారు జామున ముగ్గురు నిందితులను వెంటబెట్టుకుని మృతదేహాలను పడేసిన చోటుకు వెళ్లారు. లోయలో పడేసిన మృతదేహాలకు సంబంధించిన పలు శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యలలో పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. విడాకులు, ఆస్తి కారణంగా కూడా ఈ హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు. తదుపరి సమాచారం కోసం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details