దిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఓ గ్యాంగ్స్టర్ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఏం జరిగింది?
గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఇందులో ఒకరిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా.
తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు.
జితేంద్ర గోగీని వివిధ కేసుల కింద 2020లో దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు. శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే కాల్పుల ఘటన జరిగింది.