తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో గ్యాంగ్​స్టర్ హత్య.. దిల్లీ జైలులో 'టిల్లు'​ మర్డర్​.. తోటి ఖైదీ చేతుల్లోనే.. - tillu tajpuriya killed

దిల్లీలోని తిహాడ్ జైలులో గ్యాంగ్​స్టర్​ టిల్లు తాజ్​పురియా హత్యకు గురయ్యాడు. మరో ఖైదీ యోగేశ్​తో పాటు అతడి అనుచరులు తాజ్‌పురియాపై ఇనుప చువ్వలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతడు చనిపోయాడు.

Delhi Rohini courtaccused gangster Tillu Tajpuriya
Delhi Rohini courtaccused gangster Tillu Tajpuriya

By

Published : May 2, 2023, 9:17 AM IST

Updated : May 2, 2023, 10:40 AM IST

దేశ రాజధాని దిల్లీలోని తిహాడ్​ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఒక గ్యాంగ్​స్టర్​ ప్రాణాలు కోల్పోయాడు. దిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు జరిపిన గ్యాంగ్‌స్టర్‌ టిల్లూ తాజ్‌పురియా అలియాస్‌ సునీన్‌మాన్‌పై తోటి ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ యోగేశ్ తుండా దాడి చేసి చంపాడు. యోగేశ్‌ తుండాతో పాటు అతడి అనుచరులు తాజ్‌పురియాపై ఇనుప చువ్వలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ ఘటనలో తాజ్‌పురియా తీవ్రగాయాలపాలయ్యాడు. అప్రమత్తమైన జైలు అధికారులు దిల్లీలో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తాజ్​పురియాను తరలించారు. కానీ అప్పటికే తాజ్‌పురియా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఖైదీ రోహిత్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

"మంగళవారం ఉదయం 7 గంటలకు.. తిహాడ్​ జైలులోని ఇద్దరు ఖైదీలను తీసుకువచ్చినట్లు DDU ఆసుపత్రి నుంచి సమాచారం అందింది. అందులో టిల్లును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు జైలు అధికారులు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ఖైదీ రోహిత్ చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు" అని దిల్లీ అదనపు డీసీపీ అక్షత్ కౌశల్ తెలిపారు.

టిల్లు తాజ్​పురియా X జితేందర్‌ గోగి
దిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్‌ గ్యాంగ్‌కు నేతృత్వం వహిస్తున్నాడు గ్యాంగ్​స్టర్​ టిల్లు తాజ్‌పురియా. 2015లో ఓ కేసులో అరెస్టై అప్పటి నుంచి తిహాడ్‌ జైల్లో ఉంటున్నాడు. టిల్లు గ్యాంగ్‌కు దిల్లీకి చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది. 2021 సెప్టెంబరులో గోగి దిల్లీలోని రోహిణి కోర్టులో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేసు విచారణ నిమిత్తం అతడిని కోర్టుకు తీసుకురాగా.. అదే సమయంలో న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు టిల్లు అనుచరులు.. కోర్టు ఆవరణలోనే గోగిపై కాల్పులకు తెగబడ్డారు.

ఆ సమయంలో దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపారు. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో జితేందర్‌ అక్కడిక్కడే మరణించాడు. ఈ కాల్పులను తిహాడ్‌ జైలు నుంచి టిల్లు ఫోన్‌లో పర్యవేక్షించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రోహిణి కోర్టు కాల్పుల ఘటనలో టిల్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తాజాగా టిల్లుపై దాడి చేసిన యోగేశ్‌.. గోగి గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ అని తెలుస్తోంది. గోగి హత్యకు ప్రతీకారంగానే యోగేశ్.. టిల్లును హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన తర్వాత తిహాడ్​ జైలులో ఖైదీల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం.. మరో ఖైదీ ప్రిన్స్​ తెవాతియా సైతం అదే జైలులో హత్యకు గురయ్యాడు. ఆ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. అంతకుముందు 2021లో అంకిత్ గుజ్జర్ జైలులోనే హత్యకు గురయ్యాడు.

Last Updated : May 2, 2023, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details