Delhi Riots: హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా వాయవ్య దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 14 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మేదా లాల్ బుల్లెట్ తగిలి గాయపడ్డారు. సీ-బ్లాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయని మేదా లాల్ వెల్లడించారు. గాయపడ్డవారిలో పోలీసులతో పాటు పౌరులు కూడా ఉన్నారు.
వాయువ్య దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు అల్లర్లతో బుల్లెట్ తగిలి గాయపడ్డ సబ్ ఇన్స్పెక్టర్ మేదా లాల్ "మతకలహాలు సృష్టించేందుకు పన్నిన కుట్రలో భాగమే శనివారం జరిగిన ఘర్షణలు. సీ బ్లాక్ మసీదు వద్దకు వచ్చేవరకు శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడే ఓ వ్యక్తి 4-5 మందితో కలిసి శోభాయాత్రలో పాల్గొన్న వారితో వాదించడం మొదలు పెట్టాడు. పోలీసులు దీనిని అదుపు చేసిన కాసేపటికే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి."
-పోలీసులు
అమన్ కమిటీలతో చర్చలు: నగరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు దిల్లీ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా.. అమన్ కమిటీలతో ఆదివారం సమావేశమయ్యారు. వారి ప్రాంతాల్లో ప్రజలకు శాంతియుతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేయాలని కమిటీ సభ్యులను కోరారు. వాయవ్య ప్రాంత డిప్యూటీ కమిషనర్ ఉషా రంగ్నానీ ఆధ్వర్యంలో జహంగిర్పురీ, మహేంద్ర పార్క్, ఆదర్ష్ నగర్ ప్రాంతాల అమన్ కమిటీలతో ఈ సమావేశం జరిగింది. పోలీసులకు అందుబాటులో ఉండాలని.. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు అమన్ కమిటీలను కోరారు.
గస్తీ కాస్తున్న భద్రతా బలగాలు హనుమాన్ జయంతి అల్లర్ల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం దిల్లీలో ఘర్షణల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో మతపరమైన ర్యాలీలు ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి గొడవ జరిగినా వెంటనే స్పందించి జనం గుమికూడకుండా జాగ్రత్తపడాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారి చేశారు.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో శోభాయాత్ర ఊరేగింపులోనూ శనివారం ఘర్షణలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం వల్ల దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు వాహనాలను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పు కూడా పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది.
గస్తీ కాస్తున్న భద్రతా బలగాలు పోలీసులపై దాడి.. కర్ణాటకలోని హుబ్బలీ ప్రాంతంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మూక.. పోలీసుల వాహనాలు, సమీపాన ఉన్న ఆసుపత్రి, హనుమాన్ ఆలయాను ధ్వంసం చేసింది. 12 మంది పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది పథకం ప్రకారం చేసిన దాడి అని.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా దుండగులు ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.
అభ్యంతకర పోస్ట్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందుకు కారణమైన వారిని అరెస్ట్ చేసినా పలువురు సంతృప్తి చెందలేదని.. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద గొడవకు దిగారని పోలీసులు వెల్లడించారు. వారిని చెదరగొట్టినా అర్ధరాత్రి మళ్లీ వచ్చి దాడికి దిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించామని.. ఇప్పటివరకు 40 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :బోట్ ఆపరేటర్ల మధ్య గొడవ.. సరస్సులో చిక్కుకున్న ప్రయాణికులు