దిల్లీలో వరుణుడి ప్రతాపం.. వారికి సెలవులు రద్దు.. వరద హెచ్చరికలు జారీ! Delhi Rain News : దేశరాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో జోరు వర్షానికి హస్తిన చిగురుటాకులా వణికింది. శనివారం నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రగతి మైదాన్, నెహ్రూ నగర్, పంచశీల మార్గ్, రఫీ మార్గ్, ఫిరోజ్ షా రోడ్డు, ఐటీవో, మండి హౌస్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటి కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కాలువ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే..
మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడమే.. నీరు రోడ్డుపైకి చేరడానికి కారణమని దిల్లీవాసులు ఆరోపిస్తున్నారు. జఖిర ప్రాంతంలో షెడ్డు కూలిపోగా శిథిలాల్లో చిక్కుకుపోయిన ఇద్దరిని దిల్లీ అగ్నిమాపక విభాగం రక్షించింది. వర్షాలకు గర్హి ఝారియా మారియా ప్రాంతంలో దిల్లీ ప్రభుత్వ పాఠశాల గోడ కూలింది. దిల్లీలో కొన్ని పాఠశాలల భవనాలు చాలా పాతవని చెప్పిన మంత్రి ఆతిషి.. అన్ని పాఠశాలల భవనాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
1982 తర్వాత ఇదే తొలిసారి..
Delhi Rain Forecast : దిల్లీలో శనివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర వరకు 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత హస్తినలో ఒక్క రోజు అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులు దిల్లీలో వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం తెలిపింది. ఎడతెరిపిలేని వానలతో దిల్లీలో జనజీవనం అస్తవ్యవస్థమైన నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వ అధికారుల సెలవును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రద్దు చేశారు. అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలని ఆయన ఆదేశించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాలకు దిల్లీ మంత్రులు
ముఖ్యమంత్రి ఆదేశాలతో దిల్లీ మంత్రులు, మేయర్ షెల్లీ ఒబెరాయ్ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో 15 శాతం 12 గంటల్లోనే ఇప్పుడు దిల్లీలో కురిసిందన్న మేయర్ షెల్లీ.. రికార్డు వర్షం వల్లే రహదారులపై నీరు చేరినట్లు చెప్పారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు.
రహదారిపై నడుములోతు నీరు..
Delhi Rain Update : గురుగ్రామ్‌లో వర్షం వాహనదారులకు నరకం చూపింది. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. నర్సింగాపుర్ చౌక్ వద్ద రహదారి మొత్తం నీటితో నిండిపోయింది. గురుగ్రామ్ సెక్టార్ 50 వద్ద నీటిలో కారు చిక్కుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు. రహదారిపై నడుములోతు నీరు చేరడం వల్ల ద్విచక్రవాహనాల్లోకి నీరు వెళ్లిపోయి కదలకుండా మొరాయించాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రాజీవ్ చౌక్, సుభాష్ చౌక్, భక్త్వార్ సింగ్ రోడ్డు, సెక్టార్ 9A, శివాజీ పార్క్, బాసాయి రోడ్డు, పటౌడీ రోడ్డు మార్గాల్లో పరిస్థితి.. మరీ ఇబ్బందికరంగా ఉందని స్థానికులు ఆరోపించారు.
పెరుగుతున్న యమునా నది నీటిమట్టం.. వరద హెచ్చరికలు జారీ..
Delhi Yamuna River : ఎగువ నుంచి వస్తున్న వరదతో దిల్లీ యమునా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు దాటుతుందని.. కేంద్ర జల సంఘం తెలిపింది. హత్నికుండ్ డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల దిల్లీ ప్రభుత్వం వరద హెచ్చరికలు జారీ చేసింది.
ఎల్జీకి షా ఫోన్.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన కేజ్రీవాల్
దేశ రాజధానిలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న వేళ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజా పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిల్లీలో ఉన్న పాఠశాలన్నింటికీ సోమవారం సెలవు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
భారీ వర్షాలు.. 17 రైళ్లు రద్దు
Delhi Rains Trains Cancelled : దిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఉత్తర రైల్వే అప్రమత్తమైంది. 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. రద్దు చేసిన రైళ్లలో ఫిరోజ్‌పుర్ కాంట్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చండీగఢ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, చండీగఢ్ -అమృత్‌సర్ జంక్షన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. దారి మళ్లించిన వాటిలో ముంబయి సెంట్రల్- అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్, దౌలత్‌పుర్ చౌక్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఉన్నాయి.