దిల్లీలో ఓ గర్భిణీ వైద్యురాలిని కొవిడ్ మహమ్మారి కాటేసింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరి క్షణాల్లో డాక్టర్ డింపుల్ అరోరా చావ్లా పంచుకున్న వీడియో.. చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె భర్త ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గర్భిణీ అయిన అరోరా చావ్లాకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఆమె భర్త రవి చావ్లా. అయితే.. వ్యాధి మరింత తీవ్రం కావడం వల్ల.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారామె. ఈ క్రమంలో ఇదే తన ఆఖరి రోజని చెబుతూ.. ఊపిరి బిగపట్టి చివరి క్షణాల్లో ఓ సందేశమిచ్చారు. "దయచేసి కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ సన్నిహితుల కోసం తప్పనిసరిగా మాస్కులు ధరించండి, నిబంధనలు పాటించండి" అని చెప్పారామె. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ దృశ్యాలను ఆమె కోరిక మేరకు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రవి.