రైతు ఉద్యమానికి సంబంధించి జనవరి 11న జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన 'టూల్ కిట్' సమావేశంలో పాల్గొన్న వారి వివరాల కోసం దిల్లీ పోలీసులు.. జూమ్ సంస్థకు లేఖ రాశారు. ఈ సమావేశాన్ని ఖలిస్థానీ అనుకూల వర్గమైన పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(పీజేఎఫ్) నిర్వహించిందనీ... ఇందులో పాల్గొన్న 70 మందిలో ముంబయికి చెందిన న్యాయవాది నిఖితా జాకబ్, పుణెకు చెందిన ఇంజినీర్ శంతను ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
"ఈ మెయిల్ ద్వారా టూల్ కిట్ డాక్యుమెంట్‌ను శంతను రూపొందించాడు. కెనడాకు చెందిన ఓ మహిళ ద్వారా ఖలిస్థానీ వ్యవస్థాపకుడు మో ధలివాల్.. నికితా జాకబ్, శంతనును సంప్రదించాడు. జనవరి 11న ఖలిస్థానీ గ్రూప్ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో నికిత, శంతను పాల్గొని 'గ్లోబల్ ఫార్మర్ స్ట్రైక్' పేరుతో టూల్‌కిట్‌ను తయారు చేయాలని నిర్ణయించారు."
-- ప్రేమ్ నాథ్, దిల్లీ జాయింట్ కమిషనర్, సైబర్ క్రైం విభాగం