తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుస్తులు చించేశారని మహిళా ఎంపీ ఆరోపణ.. కేంద్రంపై కాంగ్రెస్​ ఫైర్ - కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ

Congress MP Jothi Mani: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం నిరసనల సందర్భంగా.. తమపై దిల్లీ పోలీసులు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారని ఆరోపించారు కాంగ్రెస్​ నేతలు. తన దుస్తులను చించేసినట్లు సంచనల ఆరోపణలు చేశారు కరూర్​ ఎంపీ జ్యోతిమణి. మరోవైపు.. తమ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశాయి కాంగ్రెస్​ బృందాలు.

delhi police tore my Clothes alleges congress MP
delhi police tore my Clothes alleges congress MP

By

Published : Jun 16, 2022, 2:32 PM IST

Congress MP Jothi Mani:కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతల పట్ల దిల్లీ పోలీసుల వ్యవహార శైలి పెను దుమారానికి దారితీసింది. తాజాగా కాంగ్రెస్‌ మహిళా ఎంపీ ఒకరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై దాడి చేసి, తన దుస్తులను చించారని ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆందోళన చేస్తోన్న తమ పట్ల పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని తమిళనాడులోని కరూర్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు. ''దిల్లీ పోలీసులు మాపై దారుణంగా దాడి చేశారు. నా బూట్లను లాగేసి.. నా దుస్తులను చించేశారు. నేరస్థుల వలే మమ్మల్ని బస్సుల్లోకి ఎక్కించి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు. నీళ్లు కొనుక్కునేందుకు వెళ్తే దుకాణాల వారిని బెదిరించి.. మాకు నీరు లేకుండా చేశారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? దీనిపై లోక్‌సభ స్పీకర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా'' అని ఆమె వీడియోలో మాట్లాడారు.

ఈ వీడియోను శశిథరూర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై మండిపడ్డారు. ''ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇది అత్యంత దారుణమైన ఘటన. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం.. ప్రతి భారతీయుడి మర్యాదకు భంగం కలిగించినట్లే. ఇప్పుడు ఒక లోక్‌సభ ఎంపీకి ఇలా జరగడం మరింత ఘోరం. దిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? స్పీకర్‌ జీ.. దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి'' అని థరూర్‌ కోరారు.

రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిరసనల సందర్భంగా దిల్లీలో బుధవారం కూడా తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయి. కొంతమంది పోలీసులు బలవంతంగా తమ కార్యాలయంలోకి ప్రవేశించారని.. లాఠీఛార్జి చేసి పార్టీ నేతలు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్‌ ఆరోపించింది. మహిళా కార్యకర్తలతోనూ దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడింది. అక్రమంగా లోపలకు చొచ్చుకొచ్చిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే, ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ''నిషేధాజ్ఞల నేపథ్యంలో నిరసన ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలనుకున్నాం. ఏఐసీసీ కార్యాలయం గేటు మూసేసేందుకు మేం ప్రయత్నించాం. ఆ ప్రక్రియలో కొంత ఘర్షణ చోటుచేసుకున్న మాట వాస్తవం. అంతేగానీ, ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు మేం ప్రయత్నించలేదు.'' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

రాజ్యసభ ఛైర్మన్​, లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు:నిరసన సందర్భంగా దిల్లీలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ నేతలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్​ ఖర్గే. తమ నాయకులు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చిందని, కొందరికి పక్కటెముకలు విరిగాయని అన్నారు. రాజ్యసభ సభ్యులను రక్షించాల్సిన బాధ్యత ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఉందని, అందుకే ఆయనకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఖర్గే. చిదంబరం, కేసీ వేణుగోపాల్​, జైరాం రమేశ్​ సహా పలువురు ఎంపీలు వెంకయ్యను కలిసిన బృందంలో ఉన్నారు.

మరోవైపు.. తమ ఎంపీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధిర్ రంజన్‌ చౌదరి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ బృందంలో పార్టీ చీఫ్​ విప్​ కె. సురేశ్​, లోక్​సభలో కాంగ్రెస్​ విప్​ మాణిక్యం ఠాగూర్​, ఎంపీ గుర్జిత్​ సహా పలువురు ఉన్నారు.

ఇవీ చూడండి:'అది మా తాత జాగీరు'... ప్రభుత్వ ఆస్తిని అమ్మేసిన మనవడు

'అగ్నిపథ్'​పై ఉద్యోగార్థులు భగ్గు.. రెండు రైళ్లకు నిప్పు.. ఉపసంహరణకు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details