పండగల సమయంలో దేశ రాజధానిలో(Terrorist Attack in Delhi) ఉగ్రముఠాలు దాడులు నిర్వహించే అవకాశం ఉందన్న హెచ్చరికలనేపథ్యంలో దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు(Delhi Police) అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపుకార్డుతో కొన్నాళ్లుగా అతడు దిల్లీలోనే ఉంటున్నాడు. అతడిని మహ్మద్ అష్రఫ్‌గా గుర్తించారు. అష్రఫ్ నుంచి ఏకే-47, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అష్రఫ్‌ను పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
"మహ్మద్ అష్రఫ్ అలియాస్ అలీ పాకిస్థాన్‌లోని పంజాబ్ నివాసి. సోమవారం రాత్రి దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశాం. అలీ అహ్మద్ నూరి పేరిట నకిలీ గుర్తింపుతో భారత్‌లో ఉంటున్నాడు. ఏకే-47, 60 బుల్లెట్లు, ఓ గ్రెనేడ్, రెండు పిస్టల్‌లతో పాటు ఫేక్ ఐడీ, ఓ బ్యాగ్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం."