Mohammed Zubair Delhi police: హిందూ దేవతను అవమానించాడన్న ఆరోపణలతో అరెస్టైన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. ఆయన్ను 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. జుబైర్ ఐదు రోజుల కస్టడీ పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ మేరకు తీర్పు చెప్పింది.
Mohammed Zubair 2018 tweet:కస్టోడియల్ విచారణ ముగిసిందని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియాను కోరారు. జుబైర్‌పై నమోదైన కేసులకు.. నేరపూరిత కుట్ర, ఆధారాల చెరిపివేత సహా విదేశీ విరాళాల చట్టం ప్రకారం మరిన్ని సెక్షన్లను చేర్చినట్లు పోలీసులు వివరించారు. పోలీసుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. జుబైర్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
విదేశీ విరాళాలు రూ.2.3 లక్షలు..
మరోవైపు, ఆల్ట్‌న్యూస్ పేరెంట్ కంపెనీ ప్రవ్డా మీడియా విదేశాల నుంచి రూ.2,31,933 విరాళాలు సేకరించిందని పోలీసులు తెలిపారు. బ్యాంకాక్, ఆస్ట్రేలియా, మనామా, నార్త్ హోలండ్, సింగపూర్, విక్టోరియా, న్యూయార్క్, ఇంగ్లాండ్, రియాద్, షార్జా, అబుదాబి, స్టాక్‌హోమ్, వాషింగ్టన్, కన్సాస్, న్యూజెర్సీ, ఒంటారియో, కాలిఫోర్నియా, టెక్సస్, దుబాయ్, స్కాట్లాండ్ వంటి ప్రాంతాల నుంచి విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు. జుబైర్ అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా వచ్చిన ట్వీట్ల ఖాతాలు.. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, పాకిస్థాన్ వంటి దేశాలకు చెందినవని పేర్కొన్నారు.
అదేసమయంలో బెయిల్ కోసం జుబైర్ దరఖాస్తు చేసుకున్నారు. తన విచారణ పూర్తైన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు సీజ్ చేసిన ఫోన్ నుంచి తాను ఆ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. 'ఆ ట్వీట్ 2018కి సంబంధించినది. అప్పుడు నేను వాడిన ఫోన్ ఇది కాదు. నేను ఆ ట్వీట్‌ను ఖండించడం లేదు' అని జుబైర్ తన న్యాయవాది ద్వారా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే జుబైర్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదీ చదవండి: