రైతు పిడికిలి బిగుస్తోంది. ఎంత గళమెత్తినా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం వల్ల ఆందోళనను ముమ్మరం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. మరో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం, రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు దిశగా శనివారం నిర్ణయాలు తీసుకున్నారు. రహదారి సుంకం వసూలు చేయకుండా టోల్‌ప్లాజాలను స్తంభింపజేయడంలో పలుచోట్ల విజయం సాధించిన రైతన్నలు.. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని వారు ప్రకటించారు. ముందుగా ఆ చట్టాల రద్దుపైనే మాట్లాడాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలను చర్చిస్తామని పునరుద్ఘాటించారు. అదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. రైతు ఉద్యమ నేత కన్వల్‌ప్రీత్ సింగ్ పన్నూ శనివారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్ నుంచి జైపుర్-దిల్లీ జాతీయ రహదారి మీదుగా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఆదివారం 'చలో దిల్లీ' యాత్రను నిర్వహిస్తారని చెప్పారు.
సోమవారం సింఘు సరిహద్దులో రైతు నేతలంతా నిరాహార దీక్ష చేస్తారనీ, ఆ రోజు దేశవ్యాప్త నిరసనల్లో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. రైతుల తల్లులు, భార్యలు, కుమార్తెలు కూడా త్వరలో ఉద్యమానికి సంఘీభావంగా రాబోతున్నారని, దీక్షా శిబిరాల్లో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులూ తమకు మద్దతుగా వస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ విస్తరణ ఖాయమని పన్నూ స్పష్టంచేశారు.
పోలీసు భద్రత పెంపు
ఆందోళనను ముమ్మరం చేయాలని రైతులు నిర్ణయించుకున్న నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో కాంక్రీటు దిమ్మలతో అడ్డుకట్టలను వేశారు. దిల్లీ-జైపుర్ జాతీయ రహదారిని, యమునా ఎక్స్‌ప్రెస్‌వేని స్తంభింపజేయాలని రైతులు యోచిస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.