Delhi ordinance bill passed in Lok Sabha : దిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగులు, బదిలీలపై అధికారాలను ఎల్జీకి కట్టబెడుతూ రూపొందించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. దిల్లీ సేవల నియంత్రణ ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ బిల్లు రాజ్యాంగబద్ధమైనదేనని కేంద్ర హోంమంత్రి లోక్సభలో పేర్కొన్నారు. రాజధానిలోని ప్రజలకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. దిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల తీర్మానాలపై ఓటింగ్ నిర్వహించగా.. సభ వాటిని తిరస్కరించింది. అనంతరం సభ్యులు బిల్లును మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ చర్చలో పాల్గొన్న బీజేడీ ఎంపీ పినాకి మిశ్ర.. దిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టమైన చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
Delhi Ordinance Bill Amit Shah : ఈ బిల్లుపై లోక్సభలో నాలుగు గంటల సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి.. దానిపై చట్టం చేసే సర్వహక్కులూ కేంద్రానికి ఉంటాయని తెలిపారు. నిబంధనల అమలుకూ కేంద్రానికి హక్కు ఉందని చెప్పారు. బిల్లు పాసైన తర్వాత విపక్ష కూటమి కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. దిల్లీలోని ఆప్ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలను సైతం సకాలంలో నిర్వహించడం లేదని ఆరోపించారు. కేబినెట్ సమావేశాలు కూడా తరచుగా జరగడం లేదని అన్నారు.