Delhi Ordinance bill in Parliament : దిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ దిల్లీ' సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో ప్రవేశపెట్టారు. ముందుగానే ఆర్డినెన్స్‌ను తీసుకురావడానికి గల కారణాలను ఆయన వివరించారు. అనంతరం మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా తీసుకొచ్చే హక్కు పార్లమెంట్‌కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు సైతం ఇదే స్పష్టం చేసిందని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.
Delhi ordinance bill Lok Sabha : అయితే, దిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యం స్థానంలో 'బాబుక్రసీ'ని తీసుకొచ్చేందుకే ఈ బిల్లును తెచ్చారని దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అత్యంత అప్రజాస్వామ్యయుత బిల్లు ఇదేనని వ్యాఖ్యానించింది. 'ఆర్డినెన్స్‌తో పోలిస్తే మరింత దారుణంగా ఈ బిల్లును రూపొందించారు. దిల్లీ ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. భారత సమాఖ్య వ్యవస్థపై ఇది దాడి వంటిది. ఇండియా కూటమి ఎంపీలంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు' అని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి సైతం బిల్లును వ్యతిరేకించారు. సహకార సమాఖ్య విధానాన్ని ఈ బిల్లు పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 'ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను విస్తృతం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నారు' అని పేర్కొన్నారు.
మరోవైపు, లోక్‌సభలో జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు-2023 ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనల మధ్యే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మరో రెండు బిల్లులకు సైతం లోక్‌సభ పచ్చజెండా ఊపింది.