Delhi ordinance bill Amit Shah speech in Lok Sabha : సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే దిల్లీ సర్వీసుల బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పష్టం చేశారు. దిల్లీకి సంబంధించిన ఏ అంశంలోనైనా చట్టం తీసుకొచ్చే హక్కు పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోనూ ఇందుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
దిల్లీలో సీనియర్ అధికారుల పోస్టింగులు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టే 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ-2023' బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. కూటములకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాల చారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్ వ్యతిరేకించారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు.
"2015లో దిల్లీలో ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారి ఏకైక లక్ష్యం గొడవలు పెట్టుకోవడమే. ప్రజలకు సుపరిపాలన అందించడం కాదు. బదిలీలు, పోస్టింగులపై అధికారం లేకపోవడం వారి సమస్య కాదు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ శాఖపై నియంత్రణ లేకపోవడమే వారి అసలు సమస్య. మీ కూటమి గురించి కాకుండా.. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష ఎంపీలందరికీ నా విజ్ఞప్తి. విపక్షాలు కూటమి ఏర్పాటు చేసుకున్నా.. నరేంద్ర మోదీనే పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రధాని అవుతారు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Delhi Ordinance Bill update : అయితే, అమిత్ షా.. నెహ్రూ ప్రస్తావన తీసుకురావడంపై ప్రభుత్వానికి చురకలు అంటించారు కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. ప్రభుత్వానికి అవసరం అనిపించినప్పుడు నెహ్రూ ప్రస్తావన తీసుకొస్తారని విమర్శించారు. నిజంగానే నెహ్రూ సలహాలు పాటించి ఉంటే.. మణిపుర్, హరియాణా వంటి ఘటనలను దేశం చూసేది కాదని ఎద్దేవా చేశారు. అంతకుముందు, స్పీకర్ ఓంబిర్లా సభకు గైర్హాజరు కావడంపై విచారం వ్యక్తం చేసిన అధీర్.. విభేదాలు ఉంటే పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. సభాపతి స్థానంలో స్పీకర్‌ను చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓంబిర్లా తిరిగి వచ్చేలా చూడాలని.. ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి స్థానంలో కూర్చున్న బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్‌ను కోరారు. ఇందుకు అగర్వాల్ సానుకూలంగా స్పందించారు.
విలువైన ఖనిజాల మైనింగ్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా సవరించిన 'మైన్స్, మినరల్స్-2023' బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. మరోవైపు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు పంపించాలన్న విపక్షాల డిమాండ్ల మధ్యే బిల్లును లోక్‌సభ ముందుంచింది. ఈ బిల్లులో వ్యక్తిగత ప్రైవసీ అంశానికి ప్రాధాన్యం ఉందని, తొందరపాటుగా దీనిపై ముందుకెళ్లకూడదని విపక్ష నేతలు అధీర్ రంజన్ చౌదరి, మనీశ్ తివారీ, శశి థరూర్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది సాధారణ బిల్లేనని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
రాజ్యసభలో ప్రతిష్టంభన
కాగా, సభలో మణిపుర్ అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం పార్టీల ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, రాజ్యసభలో కార్యకలాపాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను కేంద్ర మంత్రులు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లద్ జోషి.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అయితే, మణిపుర్ అంశంపై సభలో చర్చను ప్రారంభించాలని ఇండియా కూటమి.. కేంద్ర మంత్రులకు సూచించినట్లు సమాచారం. ప్రధాని ఈ విషయంపై ప్రకటన చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తాము రాజీ పడబోమని చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇదే విషయమై రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశానికి పిలుపునిచ్చారు.