దేశంలో సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించి సంవత్సరం గడిచింది. అయితే ఈ ఏడాది కాలంలో అత్యాచార ఘటనలు ఏమాత్రం తగ్గలేదని దోషుల తరఫున న్యాయవాదిగా వ్యవహరించిన ఏపీ సింగ్ పేర్కొన్నారు. వారికి విధించిన ఉరిశిక్ష సమాజంపై ప్రభావం చూపలేదని తెలిపారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
''మహిళల పట్ల గౌరవంగా మెలగాలనే సందేశం ఇచ్చేందుకే నిర్భయ దోషులను ఉరి తీసినట్లు భావించాలి. కానీ ఈ సంవత్సరంలో అత్యాచార, హత్య ఘటనలు ఆగిపోయాయా? మహిళలపై నేరాలు జరగకుండా ఉన్న రోజంటూ ఉందా? వారిని ఉరి తీయడం కాదు.. జైళ్ల శాఖలో సంస్కరణలు రావాలి. 100కి పైగా దేశాల్లో మరణశిక్ష అమల్లో లేదు. భారత్‌లోనూ రద్దు చేయాలి. ఈ ఉరిశిక్ష ద్వారా న్యాయ, పరిపాలన వ్యవస్థ సాధించిందేంటి? ఆ నలుగురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు.. వారి కుటుంబాల్లోనూ నేరస్థులు లేరు. కష్టాలు అనుభవిస్తూ కాలం వెళ్లదీసే ఆ యువకుల కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.
పురుషుల బాధను ఎవరూ పట్టించుకోరు. పురుషుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలారోజులుగా ఉంది. మహిళా పోలీస్‌స్టేషన్లు, కమీషన్లు, మంత్రిత్వ శాఖలు, కోర్టులు ఉన్నాయి.. కానీ పురుషులకు ఇలాంటివి ఏవీ లేవు.''