సాధారణంగా రెస్టారెంట్లో భోజనం చేయాలంటే కనీసం రూ.300-500 లేనిదే కడుపునిండదు. ఇక దేశ రాజధాని విషయానికొస్తే.. సామాన్యుడికి జేబుకు చిల్లుపడటం ఖాయం! అటువంటిది ఏసీ గదిలో రూ.10కే కడుపునిండా భోజనం అందిస్తోంది 'వన్ మీల్' ఎన్జీఓ. మౌజ్‌పుర్-బాబర్‌పుర్ మెట్రో స్టేషన్ సమీపంలో 'వన్ మీల్' అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి తిన్నంత భోజనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా అందరికి తాగడానికి మినరల్ వాటర్‌నే అందుబాటులో ఉంచి.. అన్నార్తుల ఆకలి తీరుస్తోంది.
అలా మొదలైంది..
కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి ఉపశమనం కల్పించడమ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు 'వన్మీల్' ఎన్జీఓ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ వర్మ తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తన స్నేహితుడొకరు.. ఆర్థిక సాయం చేయమని వర్మను కోరాడు. దాంతో చలించిపోయిన వర్మ.. మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న కొందరికైనా సాయపడాలనే ఉద్దేశంతో.. తాను చేస్తున్న సామాజిక సేవను మరింత విస్తరించాలని నిర్ణయించారు.
"తొలుత ప్రజలకు రేషన్ ఇవ్వడం మొదలుపెట్టాం. అయితే దానిని వారు అమ్ముకుంటున్నారని తెలిసింది. తర్వాత ఉచితంగా భోజనాన్ని అందించడం ప్రారంభించాం. ఆ సమయంలో ప్రజలు ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు గమనించాం. అప్పుడు రూ.1, రూ.5, రూ.10 భోజనం అందిస్తున్నవారి గురించి తెలిసింది. దీంతో ఆహారం వృథా కాకుండా చూసేందుకు నామమాత్రపు ధరను నిర్ణయించాం."
-కిరణ్ వర్మ, వన్ మీల్ వ్యవస్థాపకుడు
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉండే ఈ రెస్టారెంట్లో ప్రతిరోజు రకరకాల వంటలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.