Delhi Woman Murder Case : దేశ రాజధాని దిల్లీలో గత ఏడాది జరిగిన శ్రద్ధా వాకర్ తరహాలోనే మరో మహిళను అతి కిరాతంగా హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర దిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైఓవర్ సమీపంలో పలు దిక్కుల్లో మహిళ శరీర భాగాలను గుర్తించారు. మహిళ వయస్సు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరించారు.
"స్థానికుల ద్వారా బుధవారం ఉదయం 9.30 గంటలకు ఘటనపై సమాచారం అందింది. వెంటనే చేరుకుని రెండు వేర్వేరు ప్రదేశాల్లో కవర్లు చుట్టి పడేసిన మహిళ శరీర భాగాలను గుర్తించాం. వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. బాధితురాలి వయసు 35-40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. మరిన్ని ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని శోధిస్తున్నాం"
-- సాగర్ సింగ్ కల్సి, పోలీసు కమిషనర్
'దిల్లీలో ఎందుకు వరుస హత్యలు జరుగుతున్నాయి?'
ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "దిల్లీలోని గీతా కాలనీలో మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. పోలీసులకు నోటీసులు పంపుతున్నాను. బాధితురాలు ఎవరు? నిందితుడిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? దిల్లీలో ఒకదాని తర్వాత ఒకటి దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?" అని ప్రశ్నించారు.
పెళ్లి చేసుకోమన్నందుకు.. హత్య చేసి..
కొన్నిరోజుల క్రితం.. దిల్లీలోనే ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు యువతిని హత్య చేసి దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు ఓ కిరాతకుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిత్రావు గ్రామానికి చెందిన సహిల్ గహ్లోత్, ఉత్తమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమించిన యువతితో కాకుండా.. మరో అమ్మాయితో పెళ్లిని నిశ్చయించుకున్నాడు గహ్లోత్. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. గహ్లోత్‌తో గొడవ పడింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన గహ్లోత్.. ఆమెను హత్య చేసి తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్చేయండి.
శ్రద్ధా వాకర్ ఘటనిదే!
Shraddha Walker Case : గతేడాది దిల్లీలో అఫ్తాబ్పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్‌ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.