Delhi Mundka Metro Fire: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ దిల్లీలోని ఓ వాణిజ్య భవనంలో దట్టమైన మంటలు వ్యాపించడం వల్ల భారీ ప్రాణ నష్టం సంభవించింది. భవనంలో ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పశ్చిమ దిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో భవనంలో మంటలు వ్యాపించగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 24 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేస్తున్నారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో చివరి ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు.. అనంతరం భవనం మొత్తం వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు భవనంలో చిక్కుకుపోయిన దాదాపు 60-70 మందిని ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికిపైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన సమయంలో పలువురు భవనంపై నుంచి దూకారు. నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి తలా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు అందించనున్నారు. ఘటనపై న్యాయ విచారణకు(మెజిస్టీరియల్ ఎంక్వైరీ) ఆదేశించారు.
రాష్ట్రపతి దిగ్భ్రాంతి..:దిల్లీ అగ్నిప్రమాద ఘటనపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.