ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో దిల్లీలో పోస్టర్లు అంటించారని ఆరోపిస్తూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకర పోస్టర్లు అంటించడంపై వందకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 'మోదీ హఠావో.. దేశ్ బచావో' (మోదీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి) అనే నినాదంతో ఉన్న పోస్టర్లు దిల్లీలోని పలు ప్రాంతాల్లో కనిపించాయని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. 'ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేశాం. వందకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం' అని దీపేంద్ర వెల్లడించారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ముద్రించిన 50 వేలకు పైగా వివాదాస్పద పోస్టర్లను... దిల్లీలో వేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంతో సంబంధం ఉందని భావించిన వ్యక్తులపై సుమారు 100 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఇటీవల దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో సుమారు రెండు వేల పోస్టర్లతో ఉన్న ఒక వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 44 వేల పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలేవీ లేవు. కేవలం 'మోదీ హఠావో.. దేశ్ బచావో' అన్న నినాదం మాత్రమే ఆ పోస్టర్లపై రాసి ఉంది.
పోస్టర్ల చిత్రాలను ట్వీట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అయితే, దీని వెనక ఆప్ నేతల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆప్ కార్యాలయం నుంచి ఓ వ్యాను బయటకు రాగానే అడ్డుకున్నామని దీపేంద్ర పాఠక్ తెలిపారు. అందులో నుంచి కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.
"దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్కులు, మార్కెట్లు, కాలనీలలో పోస్టర్లు కనిపించాయి. వంతెనలకు సైతం కొన్ని పోస్టర్లు కట్టినట్టు గుర్తించాం. పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ పేరు లేదు. కాబట్టి నిందితులను పట్టుకోవడం సవాల్‌గా మారింది. ఏదైనా రాజకీయ పార్టీ ప్రోద్బలంతో వీటిని అంటించారా అనే విషయాన్ని నిందితుల నుంచి కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం."
-దిల్లీ పోలీసులు
'ఎందుకింద భయం?'
మరోవైపు, ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ.. మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. మోదీ సర్కారు నియంతృత్వం ధోరణి తారస్థాయికి చేరిందని మండిపడింది. మోదీపై ఏర్పాటు చేసిన పోస్టర్లలో 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేసేంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఏమున్నాయని ప్రశ్నించింది. 'పీఎం మోదీ.. భారత్ ఓ ప్రజాస్వామ్య దేశమని మీకు తెలియదేమో! ఒక్క పోస్టర్‌కే ఇంత భయమెందుకు?' అని ఆమ్ ఆద్మీ పార్టీ.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను సైతం ట్వీట్‌కు జత చేసింది.