Delhi MCD Elections 2022 : దేశ రాజధాని దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల భాజపా పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి.. ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది.
భాజపా గట్టి పోటీ..
ఈ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. ఆప్‌కు కాస్త గట్టి పోటీనే ఇచ్చింది కమలదళం. 104 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 4న పోలింగ్ జరగ్గా 50.47శాతం ఓటింగ్ నమోదైంది.
తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఎన్నిక
సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆప్ బరిలోకి దింపిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి బోబీ ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకాను 6,714 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. కాగా దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి అని ఎన్నికల సంఘం పేర్కొంది.
అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు..
బుధవారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అందుకోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఓట్ల లెక్కింపు జరిగిన 42 కేంద్రాల్లో 20కంపెనీల పారా మిలటరీ బలగాలతోపాటు 10వేలకుపైగా దిల్లీ పోలీసులు మోహరించారు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆప్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీడీయూ మార్గ్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్ ప్రసంగించారు.