తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా.. భాజపా, ఆప్ నేతల మధ్య తోపులాట..

దిల్లీ మేయర్‌ ఎన్నిక జరగకుండానే మరోసారి సభ వాయిదా పడింది. కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం అనంతరం భాజపా, ఆప్​ నేతల మధ్య తోపులాట జరగ్గా.. సభ వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్​ ఆఫీసర్​ సత్యశర్మ తెలిపారు.

delhi mayor polls
delhi mayor polls

By

Published : Jan 24, 2023, 3:44 PM IST

దిల్లీలో మేయర్‌ కోసం ఓటింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే మీటింగ్​ హాల్​లో గందరగోళం నెలకొంది. భాజపా, ఆమ్​ ఆద్మీ పార్టీ నేతల మధ్య తోపులాట జరగ్గా రెండో సారి ఎన్నికలు జరగకుండానే సభ వాయిదా పడింది. ఓటింగ్​ ప్రారంభమైన వెంటనే ఇరు పార్టీల కార్పొరేటర్​లు వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రిసైడింగ్​ అధికారి సత్యశర్మ సభను వాయిదా వేస్తూ.. ఎన్నిక జరిగే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

అంతకుముందు.. మంగళవారం ఉదయం ఆప్‌ కార్పోరేటర్ల నినాదాల మధ్య దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త సభ్యుల ప్రమాణం జరిగింది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా భాజపా నేత సత్యశర్మ చేత.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ విషయమై ఆప్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అలాగే కొనసాగించారు. ప్రమాణస్వీకారం తర్వాత నామినేటెడ్‌ సభ్యులు 'జై శ్రీరాం', 'భారత్‌ మాతా కీ జై' అంటూ సమావేశ మందిరంలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్యశర్మ ఆప్‌ సభ్యులతో ప్రమాణం చేయించారు.

కాగా.. ఆప్‌ సభ్యుల ఆందోళనతో ఈనెల 6న జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ సమావేశం కూడా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగకుండానే వాయిదా పడింది.

దిల్లీ మేయర్​ ఎన్నిక నేపథ్యంలో మీటింగ్​ హాల్​తో పాటు దిల్లీ మున్సిపల్ కార్యాలయంలోను మంగళవారం పెద్దఎత్తున పోలీసులు.. బందోబస్తు ఏర్పాటు చేశారు. మీటింగ్​ హాల్​ వెలుపుల.. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేయడంపై ఆప్​ ఎమ్మెల్యే సౌరభ్​ భరద్వాజ్​ ప్రశ్నించారు. "ఈ రోజు భాజపా మున్సిపల్​ కార్పొరేషన్​ను స్వాధీనం చేసుకునేందుకు..బలగాలను తీసుకొచ్చింది. ఇది ఏ సభలోనైనా చూశారా?" అంటూ ఓ వీడియోను ట్విట్టర్​​లో పోస్ట్​ చేశారు.

సాధారణంగా ప్రిసైడింగ్​ అధికారి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్​లతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. లెఫ్టినెంట్​ గవర్నర్​, ప్రిసైడింగ్​ ఆఫీసర్​ ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. మొత్తం 250 మంది ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు ఏడుగురు భాజపా లోక్‌సభ ఎంపీలు.. ఆప్‌నకు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14మంది ఎమ్మెల్యేలు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటు వేయాల్సి ఉంది. తొమ్మిది మంది సభ్యులున్న కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు ఇదివరకే ప్రకటించింది.

డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో ఆప్ 134, భాజపా 104 వార్డుల్లో విజయం సాధించాయి. ఆప్‌ తరఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. భాజపా తరఫున రేఖా గుప్తా మేయర్ బరిలో నిలవనున్నారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ ఆలే మహ్మద్ ఇక్బాల్‌ను, భాజపా రామ్ నగర్ కౌన్సిలర్ కమల్ బగ్రీని నిలబెట్టాయి.

ABOUT THE AUTHOR

...view details