తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంకీపాక్స్​ కలవరం.. భారత్​లో పెరుగుతున్న కేసులు.. ఆ దేశాలు అలర్ట్ - delhi monkey pox case virus

Monkey Pox in India: కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ 75 దేశాలకు వ్యాప్తి చెందగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితి విధించింది. భారత్‌లోనూ మరో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో మూడు మంకీపాక్స్‌ కేసులు నమోదవ్వగా.. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు.

Monkey Pox in India
Monkey Pox in India

By

Published : Jul 24, 2022, 1:43 PM IST

Updated : Jul 24, 2022, 6:59 PM IST

Monkey Pox in India: భారత్​లో మరో మంకీపాక్స్​ కేసు నమోదైంది. దిల్లీలో 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లయింది. అతడు ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. గతంలో దేశంలో మంకీపాక్స్‌ బారినపడిన ముగ్గురూ కేరళకు చెందినవారే. వీరు పశ్చిమాసియా దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. డైరక్టరేట్ జనరల్​ ఆఫ్​ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం(ఎన్​సీడీసీ), ఐసీఎంఆర్​ ప్రతినిధులు హాజరయ్యారు.

పశ్చిమాఫ్రికాలో వెలుగుచూసిన మంకీపాక్స్‌.. ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అప్రమత్తమైంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించగా ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు మంకీపాక్స్‌ విస్తరించిందని 16 వేల మందికి వ్యాధి సోకిందని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ వెల్లడించారు. మంకీపాక్స్‌ వల్ల ఇప్పటివరకు 5 మరణాలు సంభవించాయని తెలిపారు. మంకీపాక్స్‌ కేసుల్లో దాదాపు 98 శాతం కేసులు స్వలింగ సంపర్కుల్లోనే వెలుగు చూస్తున్నట్లు నివేదికలు రాగా.. అటువంటి పురుషులను కీలకంగా పరిశీలిస్తుండాలని డబ్ల్యూహెచ్​ఓ సూచించింది.

కరోనా వైరస్‌ సోకిన వారికి మంకీపాక్స్‌ సోకుతోందని వార్తలు వస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ చివరి వారంలో కరోనా వైరస్‌ బారినపడ్డారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగులో పొక్కులు రావడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అయితే, ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని.. వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా నిర్ధరించాల్సి ఉంది.

ఇవీ చూడండి:గుట్టలుగా నోట్ల కట్టలు.. మంత్రి అరెస్ట్​.. రూ. 20 కోట్లు స్వాధీనం

'మా పని మనిషితోనే స్టెరాయిడ్స్​ ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా వేధిస్తోంది'

పేద ప్రజల ఆకలి తీర్చాడని.. ఉరి తీశారు!

Last Updated : Jul 24, 2022, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details