Delhi Man Guinness World Record : 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో ఓ వ్యక్తి.. దిల్లీ మెట్రోలోని 286 స్టేషన్లను తిరిగి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు. అతడు ఈ అరుదైన రికార్డును 2021 ఏప్రిల్లోనే సాధించినా.. గిన్నిస్ సంస్థ మాత్రం ఇటీవల ఆ ప్రయత్నాన్ని గుర్తించి అతడి పేరును రికార్డుల్లో నమోదు చేసింది.
ఇదీ కథ..
దిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి వృత్తి పరంగా పరిశోధన విభాగంలో ఓ ఫ్రీలాన్సర్. అయితే అతడు 2021 ఏప్రిల్ 14న ప్రతిష్ఠాత్మకంగా మెట్రో జర్నీని చేపట్టాడు. అతడు తెల్లవారుజామున 5 గంటలకు దిల్లీ మెట్రోలోని బ్లూ లైన్ వద్ద జర్నీని ప్రారంభించాడు. ఎన్నో సవాళ్లను అధిగమించి, మెట్రోలోని అన్ని స్టేషన్లను చుట్టు ముట్టి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు గ్లీన్ లైన్లోని బ్రిగెడియర్ హోషియర్ సింగ్ స్టేషన్ వద్ద ప్రయాణాన్ని ముగించాడు. కాగా అతడి జర్నీని గిన్నిస్.. ఏప్రిల్లో గుర్తించింది.
రెండేళ్లు ఆలస్యంగా గుర్తించి అవార్డును ప్రదానం చేసిన గిన్నిస్ గిన్నిస్మార్గదర్శకాలకు అనుగుణంగానే.. మను ఈ జర్నీని చేశాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో ఆధారాల కోసం.. ప్రతి స్టేషన్లో ఓ ఫోటో దిగి, అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సంతకాలను సేకరించాడు. అంతేకాకుండా అతడి మొత్తం ప్రయాణాన్ని మరో ఇద్దరు వ్యక్తులు ధ్రవీకరించారు.
జర్నీని పూర్తి చేసుకున్నందుకు గిన్నిస్ రికార్డుల్లోకెక్కగానే మను వెంటనే తన ట్విట్టర్ నుంచి "హేయ్ గిన్నిస్! దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను తక్కువ సమయంలో తిరిగి జర్నీని పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడే గిన్నిస్ వారు నాకు సర్టిఫికేట్ జారీ చేశారు. నా రికార్డు గురించి దేశంలో ఉన్న చాలా మీడియా సంస్థలు చూపించాయి. ధన్యవాదాలు" అంటూ అతడు పోస్ట్ చేశాడు.
పొరపాటున ఇంకో వ్యక్తికి గిన్నిస్ సర్టిఫికెట్...
అయితే మను సాధించిన ఈ ఘనతను గిన్నిస్ గుర్తించడంలో ఓ చిన్న పొరపాటు జరిగింది. గిన్నిస్ ఈ అవార్డును మొదటగా.. ప్రఫుల్ సింగ్ అనే ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్కు బహుకరించింది. అతడు కూడా దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లను 2021 ఆగస్టులో 16 గంటల 2 నిమిషాల్లో పూర్తి చేశాడు. కానీ మను ఇదే జర్నీని ప్రఫుల్ కంటే తక్కువ సమయంలో పూర్తి చేశాడని తెలుసుకొని అతడికి ఆలస్యంగా ఈ అవార్డును ప్రదానం చేసింది.
దిల్లీ మెట్రో 391 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. నోయిడా, గ్రేటర్ నోయిడా లైన్లను కలుపుకొని 286 స్టేషన్లను కలిగి ఉంటుంది. దేశ రాజధాని నగరంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులుతగ్గించడానికి ప్రభుత్వం ఈ మెట్రోను 2002లో ప్రారంభించింది. అప్పటి నుంచి పలు దశల్లో మెట్రో విస్తరణ జరిగింది.