పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నుంచి బ్యాంకు గోడకు కన్నం వేసి ఓ వ్యక్తి రూ. 55 లక్షలు దోచేశాడు. ఈ ఘటన దిల్లీలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. అయితే హెల్మెట్ పెట్టుకుని నిందితుడు చేసిన దోపిడి సినిమాని తలపించేలా ఉంది. ఈ చోరీలో నాటకీయ పరిణామాలు చూస్తే అవాక్కవుతారు.
సీసీటీవీ ట్యాంపరింగ్..
అధికారుల ఫిర్యాదుతో సోమవారం ఉదయం వచ్చిన పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న 50 సీసీటీవీలను తనిఖీ చేశారు. గత ఆర్నెళ్లుగా బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లోకి వచ్చిన వారి డేటాను పరిశీలించారు. అయితే.. బ్యాంకు ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీ.. పక్కనే నిర్నాణంలో ఉన్న భవనం ముఖద్వారాన్ని రికార్డ్ చేయగలదు. ఆ సీసీటీవీ దిశను మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నిందితుల ముఖం, అరచేతి భాగాలు మిల్లీ సెకన్లపాటు ఉన్నట్లు కనుగొని దర్యాప్తు కొనసాగించారు.
బురిడీ కొట్టించడానికి యత్నించి..
సీసీటీవీల ఆధారంగా బ్యాంకు ఏటీఎం ఉన్న భవనానికి కాపలాగా ఉన్న వ్యక్తిని విచారించగా హరిరామ్ పేరు బయటకు వచ్చింది. హరిరామ్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. దిల్లీలో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. కన్స్ట్రక్షన్ వర్క్‌లో పనిచేసేవాడు. హరిరామ్‌ను విచారించారు పోలీసులు. తనకు ఓ వ్యక్తి రూ.10,000 ఇచ్చి సీసీటీవీ దిశని మార్చమన్నాడని చెప్పిన హరిరామ్.. మొదట పోలీసులను బురిడి కొట్టించడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. సీసీటీవీ దిశను తానే మార్చానని చెప్పాడు. బ్యాంకులో స్ట్రాంగ్‌రూమ్ రహస్యాలు ఎలా తెలుసని నిందితున్ని ప్రశ్నించగా.. పోలీసులకు సమాధానం ఇచ్చాడు.