తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం స్కామ్​ కేసులో మనీశ్​ సిసోదియా అరెస్ట్.. బీజేపీ, ఆప్ మాటల యుద్ధం - మద్యం కేసు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది.

delhi liquor scam manish sisodia arrested
delhi liquor scam manish sisodia arrested

By

Published : Feb 26, 2023, 7:27 PM IST

Updated : Feb 27, 2023, 6:50 AM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం నుంచి మనీశ్​ను ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఆయన్ను అరెస్టు చేసినట్లు సాయంత్రం ప్రకటించింది. విచారణలో అడిగిన ప్రశ్నలకు సిసోదియా సంతృప్తికర సమాధానాలు ఇవ్వనందునే ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. అరెస్టు నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. సీబీఐ ఆఫీసు పరిసరాలన్నీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

8 గంటల విచారణ
దిల్లీ మద్యం స్కామ్ కేసులో సీబీఐ ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇటీవల మనీశ్​ సిసోదియాకు సమన్లు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఉదయం 11.12కు దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు ఉపముఖ్యమంత్రి. దిల్లీ నూతన మద్యం విధానంపై అనేక కోణాల్లో సిసోదియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దినేశ్​ అరోరా సహా ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు. వారితో జరిపిన సంభాషణలపైనా ప్రశ్నించారు. అయితే.. దిల్లీ ఉపముఖ్యమంత్రి విచారణకు సహకరించలేదని సీబీఐ అధికారులు చెప్పారు. అనేక విషయాల్లో స్పష్టమైన జవాబులు చెప్పలేదని అన్నారు. అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మద్యం కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్టు ఖాయమని ఆదివారం ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా సిసోదియా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. "ఆమ్​ఆద్మీ పార్టీకి, మా అధినేత అరవింద్ కేజ్రీవాల్​కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారు. అందుకే సీబీఐ, ఈడీతో కుట్రలు పన్నుతున్నారు. మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సీబీఐ, ఈడీ, తప్పుడు కేసులకు మేము భయపడం." అని అన్నారు సిసోదియా.

'ఆయన అమాయకుడు'
మనీశ్ సిసోదియా అమాయకుడని, ఆయన అరెస్టు నీచ రాజకీయమని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీశ్ అరెస్టు కారణంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఈ పరిణామంతో తమ పోరాటం ఇంకా బలపడుతుందని పేర్కొన్నారు. అరెస్టు వార్త తెలియగానే తన సతీమణితో కలిసి సిసోదియా ఇంటికి వెళ్లారు కేజ్రీవాల్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం సిసోదియా నివాసానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

'ఎందుకు వెనక్కి తీసుకున్నారు?'
కాగా, ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సిసోదియాను లిక్కర్ మంత్రిగా పేర్కొంది. ఆమ్ ఆద్మీకి ముడుపులు వస్తాయన్న ఉద్దేశంతో లిక్కర్​పై కమిషన్లు పెంచారని ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకున్నారో ఇంతవరకు చెప్పలేదని వ్యాఖ్యానించింది. లిక్కర్ పాలసీని మంత్రి మండలికి పంపే ముందు కాంట్రాక్టర్లకు లీక్ చేశారని ఆరోపించింది.

ఇదీ కేసు
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారని పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరును ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు.

Last Updated : Feb 27, 2023, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details