తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లిక్కర్ స్కామ్​ ఎఫెక్ట్​.. దిల్లీలో ఇద్దరు మంత్రుల రాజీనామా - ఆప్​ మంత్రుల రాజీనామా

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి రాజీనామా పత్రాలను ఆమోదించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ వీటిని గవర్నర్ వీకే సక్సేనా​కు పంపనున్నారు.

Manish Sisodia Satyendra Jain Resignation
మనీశ్​ సిసోదియా సత్యేంద్ర జైన్​ రాజీనామా

By

Published : Feb 28, 2023, 6:05 PM IST

Updated : Feb 28, 2023, 9:07 PM IST

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి రాజీనామాలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ ఆమోదించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్​ కుమార్​ సక్సేనాకు ఇద్దరి రాజీనామా పత్రాలను పంపనున్నారు. దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోదియా దిల్లీ ప్రభుత్వంలోని 33 శాఖల్లో 18 శాఖలకు బాధ్యతలు నిర్వహించేవారు. వీటిలో ఆరోగ్యం, ఆర్థికం, విద్య, హోం శాఖలతో సహా మొత్తం 18 శాఖలు ఉన్నాయి. తాజాగా సిసోదియా రాజీనామాతో ఆయన శాఖా బాధ్యతలను మంత్రివర్గంలోని రెవెన్యూ శాఖ మంత్రి కైలాశ్​ గహ్లోత్​, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్​ కుమార్ ఆనంద్​​కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సిసోదియా స్థానంలో కొత్త మంత్రిగా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయబోరని తెలుస్తోంది.

రాజీనామా చేసేది ఇప్పుడా..?
18 విభాగాలను పర్యవేక్షిస్తున్న సిసోదియాకు నైతిక విలువలు, బాధ్యతలు తెలిసి ఉంటే ఎప్పుడో రాజీనామా చేసేవారని భాజపా విమర్శించింది. కానీ, ఆయన ఆరోపణలపై వివరణ కూడా ఇవ్వకుండా బెయిల్​ కోసం సుప్రీంకు వెళ్లడం పదవులపై ఆయనకు ఉన్న అత్యాశకు నిదర్శనమని బీజేపీ నేత రవిశంకర్​ ప్రసాద్​ విమర్శించారు.

"దిల్లీ కేబినెట్​లోని మంత్రులు రాజీనామా చేసినట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే సత్యేంద్ర జైన్​ రాజీనామా చేశారు. కానీ దీన్ని ఆమోదించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు 9 నెలల సమయం పట్టింది. సిసోదియా కూడా ఆరోపణలు వచ్చిన సమయంలోనే రాజీనామా చేయాల్సింది."
-రవిశంకర్​ ప్రసాద్​, బీజేపీ ఎంపీ

బెయిల్​ విచారణ నిరాకరణ..
అయితే రాజీనామాకు ముందు.. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ మంగళవారం సిసోదియా తరఫు న్యాయవాది AM సింఘ్వీ సుప్రీం కోర్టులో బెయిల్​ పిటిషన్​ను ​దాఖలు చేశారు. దీనిని భోజన విరామ సమయంలో విచారణ జరిపేందుకు అనుమతించిన న్యాయస్థానం.. సాయంత్రం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. అయితే ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించడం మంచిదని పేర్కొంది. బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించిన కొద్ది నిమిషాల్లోనే కేజ్రీవాల్​ మంత్రివర్గంలోని మనీశ్​ సిసోదియా, సత్యేంద్ర జైన్​ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

5 రోజలు సీబీఐ కస్టడీ..
ప్రస్తుతం మనీశ్​ సిసోదియాను విచారిస్తున్న సీబీఐ.. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం దిల్లీలోని స్పెషల్​ కోర్టును ఆశ్రయించింది. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం మార్చి 4 వరకు రిమాండ్​ను విధిస్తూ అనుమతనిచ్చింది. అంతకుముందు విచారణలో భాగంగా ఈ నెల 26న ఉదయం 11:12 నిమిషాలకు దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సిసోదియాను అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సిసోదియా పొంతనలేని సమాధానాలు చెప్పాడనే కారణంతో సాయంత్రం ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు.

దిల్లీ ఎక్సైజ్​ పాలసీ నూతన విధానం రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో వీరి ఇద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. గతంలో మంత్రి సత్యేంద్ర జైన్​ను విచారించి అరెస్టు చేసిన సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్​కు పంపింది. అనంతరం ఆయనకు ట్రయల్​ కోర్టు బెయిల్​ను​ మంజూరు చేసింది. కాగా, ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్​ కేసుకి సంబంధించి గతేడాది మేలో అరెస్టయిన సత్యేంద్ర ప్రస్తుతం తిహాడ్ జైల్​లో ఉన్నారు. అయితే అరెస్టు అయిన తర్వాత కూడా జైన్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. కానీ, ఆయన చేతిలోని ఆరోగ్యం, గృహ, పట్టణాభివృద్ధి శాఖలను కేజ్రీవాల్​ సిసోదియాకు అప్పగించారు.

ఇదీ కేసు..
దిల్లీ​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని గతేడాది జులైలో పెద్దఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో నివేదిక ఇచ్చారు. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారని పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరునూ ఇందులో చేర్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్​ కుమార్​ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐకి గతంలో సిఫార్సు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో పలువురు నేతలతో పాటు దిల్లీ ఉపముఖ్యమంత్రిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు ఈ ఎక్సైజ్​ నూతన పాలసీ విధానాన్ని ఆప్​ సర్కార్ వెనక్కి తీసుకుంది.

Last Updated : Feb 28, 2023, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details