దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియా 14 ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఆరోపించిన దర్యాప్తు సంస్థలు.. తనిఖీల తర్వాత సీజ్ చేసిన జాబితాలో ఆయన 5ఫోన్లు తమ వద్దే ఉన్నట్లు పేర్కొన్నాయని తెలిపారు. ఏడాది విచారణ చేసిన తర్వాత వంద కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న దర్యాప్తు సంస్థలు.. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా ఎందుకు సంపాదించలేకపోయాయని కేజ్రీవాల్ నిలదీశారు. ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చానని అంటే ఆయన్ను కూడా అరెస్ట్ చేయగలరా అని ప్రశ్నించారు.
"ఏడాది విచారణ తర్వాత వంద కోట్ల ముడుపులు ఇచ్చారు.. తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ వంద కోట్లు ఎక్కడున్నాయి? 400 చోట్లకుపైగా దాడులు నిర్వహించారు. మనీశ్ నివాసంలో సోఫాలు కూడా ధ్వంసం చేశారు. ఆయన గ్రామంతోపాటు బ్యాంకు లాకర్ తనిఖీ చేశారు. వంద కోట్లలో కొంత కూడా దొరకలేదు. ఆ తర్వాత వంద కోట్లు గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఆరోపించారు. గోవాలో తాము సేవలు పొందిన వ్యాపారులందరిపై దాడులు చేశారు. అక్కడ కూడా ఏమీ దొరకలేదు. అన్ని చెక్‌ల ద్వారా చెల్లింపులు చేశాం. అన్ని లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించాం. అక్కడ కూడా ఏమీ దొరకలేదు. ముడుపులు తీసుకుంటే డబ్బులు ఎక్కడికిపోయాయి? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెబుతున్నా.సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చాను. ఆయన్ను అరెస్ట్ చేయండి. దేశంలో ఈ విధంగా ఎవరైనా ఆరోపణలు చేస్తారు. నరేంద్ర మోదీని అరెస్ట్ చేయగలరా?.