Delhi Liquor Scam Case AAP MP Arrest : ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్. దిల్లీ మద్యం కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి ఎంపీ నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
Delhi Excise Policy Case : అంతకుముందు దిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం దిల్లీలోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సంజయ్ అరెస్ట్‌పై ఆప్ ఫైర్
AAP Sanjay Singh News :మరోవైపు ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించింది ఆప్. ఇండియా కూటమి చేతిలో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించింది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రశ్నించినందుకే సింగ్‌ను.. లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రంపై విరుచుకుపడింది. ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయించారన్నారు ఆప్ సీనియర్ నేత అతిషి. ఆప్ కార్యాలయంలో ఈడీ ఆఫీస్‌ను ప్రారంభించండంటూ ఎద్దేవా చేశారు. కేవలం ఆప్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. బీజేపీ మనుగడ సాధిస్తోందన్నారు. ప్రధానమంత్రి మోదీ అభద్రత భావానికి ఎంపీ సంజయ్ సింంగ్ అరెస్ట్ నిదర్శనమన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికలకు ముందు ఇంకా అనేక మంది ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అవుతారంటూ జోస్యం చెప్పారు.