Delhi High Court On Upsc Mains Exam : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2023 సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు అప్లికేషన్ల స్వీకరణపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు.. గురువారం తిరస్కరించింది. 2023 జులై 10న యూపీఎస్సీ జారీ చేసిన అప్లికేషన్ స్వీకరణపై స్టే విధించాలని పలువురు సివిల్స్ ఆశావాహులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ చంద్ర ధారి సింగ్ స్టే విధించడానికి నిరాకరించారు.
2023 ప్రారంభంలో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని కొందరు అభ్యర్థులు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్సర్ కీ ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది.. సివిల్స్ మెయిన్స్ పరీక్షల కోసం అప్లికేషన్ల స్వీకరణపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. లేదంటే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనివారి పిటిషన్ నిరూపయోగమైపోతుందని అన్నారు. యూపీఎస్ఎసీ ఏకపక్ష నిర్ణయం వల్ల చాలా మంది సివిల్స్ ఆశావాహులు బాధపడ్డారని అన్నారు. అయితే.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు.