నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. సాక్షులను ప్రవేశపెట్టి.. వారిని విచారించేందుకు అనుమతించాలన్న భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాజ్యంపై స్పందించాలని ఆదేశించింది.
గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియా సంస్థకు ఈ నోటీసులు జారీ చేశారు జస్టిస్ సురేశ్ కైట్. ఏప్రిల్ 12లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ.. అప్పటివరకు కేసు విచారణపై స్టే విధించారు.
కేసుకు సంబంధించి సాక్షులు ప్రవేశపెట్టాలన్న తన అభ్యర్థనను ట్రయల్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నెల 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు స్వామి.
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్(రిజిస్ట్రీ ఆఫీసర్), డిప్యూటీ ల్యాండ్ అండ్ డెవెలప్మెంట్ ఆఫీసర్, ఐటీ డిప్యూటీ కమీషనర్‌కు సమన్లు జారీ చేయాలని వ్యాజ్యంలో కోరారు స్వామి. కేసుకు సంబంధించిన పత్రాలను కూడా వారు సమర్పించే విధంగా ఆదేశాలు అందించాలని పేర్కొన్నారు.