అసలే అయినవారు కరోనా కాటుకు బలై పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులను.. అంత్యక్రియలకు సుదీర్ఘంగా వేచి ఉండాల్సి రావడం మరింతగా క్షోభ పెడుతోంది. ఓ పక్క ఎతైన పైకప్పు దిగువున 50 చితిలపై మృతదేహాలు అగ్నిలో కలుస్తుండగా, మరోవైపు అక్కడికి సమీపంలోనే మరికొన్ని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నాయి. ఓ వైపు చితమంటల వేడి, పొగ మరోవైపు వాహనాలను నిలిపి ఉంచి.. తమ వారికి అంత్యక్రియలు ఎప్పటికి పూర్తవుతాయో? అన్న ఆవేదన, దుఃఖం, ఆగ్రహం కలగలిసిన మానసిక పరిస్థితుల్లో ఉన్నవారి చూపులు. కరోనా కరాళ నృత్యంగా కారణంగా దిల్లీలోని దాదాపు అన్ని శ్మశానవాటికల్లో మంగళవారం కనిపించిన దృశ్యాలివి.
20 గంటల నిరీక్షణ..
అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తీసుకెళ్లిన వారికి.. కనీసం 16 గంటలు నుంచి 20 గంటలు ఆగాల్సి ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. "నా జీవితంలో ఏనాడూ ఇలాంటి ఘోరమైన పరిస్థితిని చూడలేదు. అంత్యక్రియల నిమిత్తం తమవారి మృతదేహాలను తీసుకుని ప్రజలు దాదాపు ప్రతిచోటకూ వెళుతున్నారు. దిల్లీలోని అన్ని శ్మశానవాటికలూ మృతదేహాలతో నిండిపోయాయి" అని 'మాస్సే అంత్యక్రియలు' అనే సంస్థకు చెందిన వినీతా మాస్సే చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెలలో దిల్లీలో 3,601 మంది మరణించారు. వీరిలో 2,267 మంది కొవిడ్-19 కారణంగా గత ఏడు రోజుల్లోనే చనిపోవడం దిల్లీలోని భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.