తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా విజృంభణతో కఠిన ఆంక్షల్లోకి దేశం!

దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళకరంగా కొనసాగుతుండగా వివిధ రాష్ట్రాలు.. వైరస్​ కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నాయి. దిల్లీలో ప్రజలు గుమిగూడటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే తమిళనాడు, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

states restrictions
పెరుగుతున్న కేసులు- రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

By

Published : Apr 11, 2021, 10:25 AM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ప్రజలు గుమిగూడటంపై దిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణాను సగం సామర్థ్యంతో మాత్రమే నడపుతామని తెలిపింది. ఈ మేరకు దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ(డీడీఎంఏ) శనివారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

దిల్లీలో ఆంక్షలు ఇలా..

  • ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు 9 నుంచి 11వ తరగతి విద్యార్థులు.. పాఠశాలకు వెళ్లేందుకు మినహాయింపు ఉంటుంది. అయితే.. ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాలలు ఏప్రిల్​ 30 వరకు మూసే ఉంటాయి.
  • మహారాష్ట్ర నుంచి దిల్లీకి వచ్చే విమాన ప్రయాణికులు 72 గంటల ముందు చేసిన ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నెగెటివ్​ ధ్రువపత్రాన్ని తీసుకురావాలి.
  • దిల్లీలో మెట్రో రైలు, బస్సులు సగం సామర్థ్యంతోనే నడుస్తాయి.
  • అంత్యక్రియలకు 20 మంది, వివాహాలు, శుభకార్యాలకు 50 మంది మాత్రమే హాజరు కావాలి.
  • బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సగం సామర్థ్యంతో మాత్రమే నడపాలి.
  • స్టేడియాల్లో ఆటలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించవచ్చు. కానీ, ప్రేక్షకులకు అనుమతి ఉండదు.
  • అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది మాత్రమే హాజరు కావాలి. మిగతావారు ఇంటి నుంచే పని చేయాలి.

అయితే.. వైద్యం వంటి అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని దిల్లీ స్పష్టం చేసింది. అంతర్​ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి నిషేధం లేదని చెప్పింది. ఈ తాజా ఆంక్షలు ఏప్రిల్​ 30 వరకు కొనసాగతాయని తెలిపింది.

తమిళనాడులో మినహాయింపులు, ఆంక్షలు

కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. తమిళనాడు ప్రభుత్వం నూతన ఆంక్షలు విధించడం సహా కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది.

  • ఏప్రిల్​ 11 నుంచి చెన్నై సహా చెంగల్​పట్టు, తిరువల్లూర్​ జిల్లాల్లోని బీచ్​లు.. ప్రతి శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మూసే ఉంటాయి.
  • రాత్రి 10 గంటల వరకు అన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరచే ఉంటాయి. అయితే.. పండుగలు, మతపర సమావేశాలకు అనుమతి లేదు.
  • కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాలకు అదనపు షోలు.. ఏడు రోజుల పాటు మాత్రమే వేయాలి.
    కరోనా విజృంభణ వేళ తమిళనాడులోని కాశిమేడు చేపల మార్కెట్​లో రద్దీ
    కాశిమేడు చేపల మార్కెట్​లో దృశ్యాలు

ఉత్తర్​ప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూ

కరోనా కట్టడి కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​ జిల్లా అధికారులు కీలక చర్యలు చేపట్టారు. శనివారం నుంచి ఏప్రిల్​ 18 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది.

కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. కంటెయిన్​మెంట్​ జోన్​ వెలుపల వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే.. గరిష్టంగా 100 మంది మాత్రమే హాజరు కావాలని చెప్పారు.

ఇందోర్​లో ఏప్రిల్​ 19 వరకు లాక్​డౌన్​

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ప్రస్తుతం కొనసాగుతున్న వారాంతపు లాక్​డౌన్​ను ఏప్రిల్​ 19 వరకు పొడిగిస్తున్నట్లు భాజపా ఎంపీ శంకర్​ లాల్వానీ తెలిపారు. ఈ మేరకు వైరస్​ కట్టడిపై జిల్లా అధికారులతో మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఒడిశాలో సరిహద్దులు బంద్​

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఒడిశా​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చేవారి వల్ల కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. ఆ రాష్ట్రంతో సరిహద్దులను మూసివేస్తున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో గస్తీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కొవిడ్​ నెగెటివ్​ రిపోర్టు తీసుకువస్తేనే ఛత్తీస్​గఢ్​ నుంచి వారికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

మాస్కులు ధరించనివారికి విధించే జరిమానాల మొత్తాన్ని పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ తెలిపారు. మొదటిసారి మాస్కు ధరించకుండా ఉంటే.. రూ.2,000 జరిమానా, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా ఉంటుందని చెప్పారు. మాస్క్ అభియాన్​లో భాగంగా 14 రోజుల పాటు అందరూ మాస్క్​ ధరించాలని పిలుపునిచ్చారు.

'దయచేసి నిబంధనలు పాటించండి'

రాజస్థాన్​లో కరోనా బీభత్సం కొనసాగుతున్నప్పటికీ.. కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ ఆందోళనవ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు.

దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నావారు వెంటనే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలని గహ్లోత్​ కోరారు. కరోనా రెండో దశ వ్యాప్తి మొదటి దశ కంటే మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు.

కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు విజయవంతంగా అమలవుతున్నాయి. లాక్​డౌన్ వల్ల ముంబయి సహా పలు నగరాలు బోసిపోయాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించారు.

వారాంతపు లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా ముంబయి నగర వీధులు
వారాంతపు లాక్​డౌన్​తో ఆదివారం బోసిపోయి కనిపిస్తున్న ముంబయి నగర వీధులు

ఇదీ చూడండి:మానవత్వాన్ని చంపేసిన కరోనా!

ABOUT THE AUTHOR

...view details