Delhi Girl Gangrape: తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన 14 ఏళ్ల బాలిక మృతదేహమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన బాలిక శవాన్ని ఔటర్ దిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. బాలికపై గ్యాంగ్‌రేప్ చేసి, ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గోనెసంచిలో శవాన్ని కుక్కి నరేలా ప్రాంతంలో పడేశారని తెలిపారు.
ఈ ఘటనలో ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. సన్నోత్ గ్రామానికి చెందిన ఈ వ్యక్తి.. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేసేవాడని తెలిపారు. దిల్లీ నుంచి ముంబయి వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు వివరించారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Delhi Teen gang raped
'ఫిబ్రవరి 12న బాలిక కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారం తర్వాత నరేలాకు చెందిన ఓ దుకాణ యజమాని నుంచి మాకు కాల్ వచ్చింది. తన షాప్ సమీపంలో తీవ్ర దుర్గంధం వెలువడుతోందని చెప్పాడు. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. పాక్షికంగా కుళ్లిన శవం కనిపించింది. అది కిడ్నాప్ అయిన బాలికదేనని నిర్ధరించాం. ఆవు పేడ కుప్పలో గోనె సంచిని పడేశారు' అని డీసీపీ వెల్లడించారు.
టెక్నికల్ సర్వైలెన్స్‌తో పాటు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా తొలి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. 'తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి తర్వాత.. బాలికకు నిందితుడు ఫోన్ చేశాడు. పని ఉందని పిలిపించుకున్నాడు. చెప్పిన ప్రదేశానికి వచ్చిన బాలికను అపహరించుకుపోయారు. బాలికపై ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ధరించిన ప్యాంటును ఆమె గొంతుకు బిగించి ప్రాణాలు తీశారు' అని డీసీపీ వివరించారు.
బాలిక మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి పంపినట్లు డీసీపీ వెల్లడించారు. కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:పుట్టినరోజు నాడే బాలికపై సామూహిక అత్యాచారం