తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ యువతి కేసులో కొత్త ట్విస్ట్​.. 'అంజలి' చిక్కుకున్నట్లు తెలిసినా 12 కి.మీ ఈడ్చుకెళ్లారట! - దిల్లీ యువతి కేసు

దిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆదివారం ప్రమాదం జరిగిన సమయంలో అంజలి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు సీసీటీవీల పరిశీలన ద్వారా పోలీసులు గుర్తించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఆమె ఏం చెప్పిందంటే?

delhi-girl-dragged-case
delhi-girl-dragged-case

By

Published : Jan 4, 2023, 6:53 AM IST

Delhi Girl Dragged Case: దేశ రాజధాని దిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుల్తాన్‌పురికి చెందిన మృతురాలు అంజలి సింగ్‌(20) భౌతికకాయానికి పరీక్ష నిర్వహించిన వైద్యబృందం.. ఆమె జననాంగాలపై ఎటువంటి గాయాలు లేవని తేల్చింది. వారి నివేదికను బట్టి.. ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టంచేశారు. యువతిపై అత్యాచారం జరిగి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. సోమవారం దిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ బోర్డు శవపరీక్ష నిర్వహించింది.

ఆదివారం ప్రమాదం జరిగిన సమయంలో అంజలి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు సీసీటీవీల పరిశీలన ద్వారా పోలీసులు గుర్తించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు మంగళవారం నమోదు చేశారు. ఆ ప్రకారం ప్రమాదం జరిగిన రాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా అంజలి, తాను కలిసి కొంతమంది స్నేహితులను కలిసేందుకు ఓ హోటల్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపింది. పార్టీ అనంతరం మద్యం సేవించి ఉన్నప్పటికీ స్కూటర్‌ నడపాలని అంజలి కోరుకున్నట్లు చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించింది. మరోపక్క పటిష్ఠ బందోబస్తు మధ్య అంజలి భౌతికకాయానికి కుటుంబసభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

న్యాయవాది నియామకం
బాధితురాలు అంజలి కుటుంబానికి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అనంతరం వారి తరఫున కోర్టులో పోరాడడానికి న్యాయవాదిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.

కారుకు అంజలి చిక్కుకున్నట్లు తెలిసినా..
అంజలి సింగ్‌ ప్రమాదానికి గురైన సందర్భంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమె స్నేహితురాలు నిధి ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని మంగళవారం వివరించారు. "ఆదివారం మేం ఇద్దరం కొంతమంది స్నేహితులను కలుసుకునేందుకు ఓ హోటల్‌కు వెళ్లాం. అక్కడ పార్టీలో అంజలి మద్యం సేవించింది. పార్టీ అయ్యాక తెల్లవారుజామున 1.45 గంటలకు స్కూటీని తానే నడుపుతానంటూ హోటల్‌ బయట అంజలి నాతో గొడవ పడింది. దానికి నేను ఒప్పుకోలేదు. కొంత దూరం వెళ్లాక నా స్కూటీని నేనే నడుపుతాను. లేదంటే దీని మీద నుంచి దూకేస్తా అంటూ బెదిరించింది. దీంతో చేసేది లేక అంజలికి బండి అప్పగించాను. ఆమె నడుపుతున్న క్రమంలో ఓసారి మేం ఓ ట్రక్కును ఢీకొట్టబోయాం. నేను ఏదోలా బ్రేకులు వేయడంతో ఆ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్నాం. ఆ తరువాత కొంత సమయానికే ఓ కారు మా స్కూటీని ఢీ కొట్టింది. దీంతో కిందపడిపోయిన నాకు కళ్ల వద్ద స్వల్ప గాయాలయ్యాయి. అంజలి కారుకు చిక్కుకుపోయింది. అయినా కారు ఆగలేదు. కొంత దూరం ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చింది. ఆపై అత్యంత వేగంతో ముందుకు వెళ్లిపోయింది. కారులో ఎటువంటి సంగీతం వినిపించలేదు. తమ కారుకు ఓ మహిళ చిక్కుకుపోయిందని అందులోని నిందితులకు తెలుసు. అయినా ఆమెను రక్షించేందుకు కారును ఒక్కసారి కూడా ఆపకుండా నా స్నేహితురాలిని లాక్కుని వెళ్లిపోయారు. ఈ సంఘటనకు నన్ను నిందిస్తారనే భయంతో ప్రమాదంపై ఎవరికీ¨ చెప్పలేదు. ఆ రోజు రాత్రి జరిగిన ఈ దారుణాన్ని మరిచిపోలేకపోతున్నాను" అని నిధి వెల్లడించారు.

కారు టైరులో కాలు ఇరుక్కోవడంతో..
కారు ఢీకొట్టిన ఘటనలో కారు టైరులో యువతి కాలు ఇరుక్కుపోవడం వల్ల ఆమెను లాక్కెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. కారు టైరులో ఏదో ఇరుక్కుపోయినట్లు నిందితుల్లో ఒకరు మిగతావారికి చెప్పగా.. వారు దాన్ని పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. కాంఝవాలా ప్రాంతంలో కారు మలుపు తీసుకుంటుండగా.. యువతి చేయి కనిపించి కారును ఆపినట్లు నిందితులు తెలిపారు. తర్వాత కారు నుంచి యువతి మృతదేహం వేరు కాగానే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. వారిపై నిర్లక్ష్యం, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details